తబ్లిగీ జమాత్‌పై దేశవ్యాప్తంగా ఈడీ దాడులు 

కరోనాకు ముందు దేశవ్యాప్తంగా కలకలం రేపిన తబ్లిగీ జమాత్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులు చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కేరళలలో బుధవారం ఏకకాలంలో దాడులు చేసింది. 
 
హైదరాబాద్‌లోని మల్లేపల్లితో పాటు పాతబస్తీలోని మరో మూడు ప్రాంతాల్లో ఉన్న తబ్లిగీ జమాత్‌ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ పోలీసులు మర్కజ్‌ చీఫ్‌ మౌలానాపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈడీ రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టింది. 
 
ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి తబ్లిగీ జమాత్‌కు విరాళాల రూపంలో వచ్చిన నిధులు నిబంధనలకు విరుద్ధంగా సొంత ఖాతాలకు బదిలీ చేశారని ఈడీ గుర్తించింది. దీంతో పీఎంఎల్‌ఏ (ప్రీవెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌) కింద మౌలానా సాద్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసింది. 
 
మనీలాండరింగ్‌తో పాటు హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. కేసు దర్యాప్తులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించింది.