కేంద్ర కేబినెట్ మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు బుధవారం ఆమోదం తెలియజేసింది. ఈ మూడు.. జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్‌ప్రైజెస్ బిడ్ రూపంలో గతేడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది.
ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ సొంతం చేసుకున్న ఆరు విమానాశ్రయాలు ప్రస్తుతం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్నాయి.
కేంద్ర కేబినెట్ తొలుత ఆమోదం తెలిపిన లక్నో, మంగళూరు, అహ్మదాబాద్ విమానాశ్రయాల నిర్వహణ, కార్యకలాపాలు, అభివృద్ధి కి సంబంధించి రాయితీ ఒప్పందాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో అదానీ కుదుర్చుకుంది. తాజాగా లీజునకు ఆమోదం తెలియజేసిన వాటిల్లో గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాల ప్రైవేటీకరణపై కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది.
కాగా, కోర్టు నుంచి ఎటువంటి స్టే ఆదేశాలు లేనందున, వీటి లీజు విషయంలో ముందుకు వెళ్లొచ్చని కేంద్రం భావించింది. ‘‘ఈ విమానాశ్రయాలను పీపీపీ కిందకు బదిలీ చేయడం అంటే సమర్థవంతమైన, నాణ్యమైన సేవలను ప్రయాణికులకు అందించేందుకు వీలు కల్పించడం. ఏఏఐ ఆదా యం పెరగడమే కాకుండా, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరిన్ని విమానాశ్రయాల అభివద్ధిపై ఏఏఐ దృష్టిసారించేందుకు అవకాశం లభిస్తుంది’’ అంటూ పౌర విమానయాన మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు.
‘‘జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను శాశ్వతంగా ప్రైవేటు ఆపరేటర్‌కు ఇవ్వడం లేదు. 50 ఏళ్ల నిర్వహణ తర్వాత ఆయా విమానాశ్రయాలను ఏఏఐకి తిరిగి ఇచ్చేయాలి. ఈ లీజు వల్ల ఏఏఐకి ప్రారంభంలోనే రూ.1,070 కోట్లు లభిస్తాయి. ప్రయాణికులకు మంచి సేవలు లభిస్తాయి‘‘అ కేంద్ర మంత్రి ని ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ