రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, రైనా

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ అనూహ్యంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. 
 
‘కెరీర్ సాంతం న‌న్ను ప్రేమించి, నాకు మద్దతుగా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. 19:29 నుంచి నేను వీడ్కోలు ప‌లికిన‌ట్లుగా భావించండి’ అని పోస్ట్ లో పేర్కొన్నాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ పై ఏడాది కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. 
 
2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత నుంచి ధోనీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ధోనీ క్రికెట్ వీడ్కోలు పలుకనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం రోజున  లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించడం గమనార్హం.
 
2004 డిసెంబర్‌ 23న వన్డే మ్యాచ్‌తో ధోనీ అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించాడు.  2019 ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో   ధోనీ  ఆఖరి వన్డే ఆడాడు. ధోనీ సారథ్యంలో భారత్‌ మూడు ఐసీసీ ట్రోఫీలు 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీలను గెలిచింది.  
 
పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ అత్యంత విజయవంతమైన భారత  కెప్టెన్‌గా నిలిచాడు.  2014 డిసెంబర్‌లో ధోనీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డేలు, టీ20లు ఆడుతూ 2015 ప్రపంచకప్‌, 2016 టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ వరకు జట్టును నడిపించాడు.
350 వన్డేలాడిన మహీ 10,773 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 183 కావడం విశేషం. వన్డేల్లో 10 సెంచరీలు సాధించగా 73 అర్ధశతకాలు బాదాడు. 90 టెస్టుల్లో 4876 రన్స్‌ సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 6 శతకాలు, 33 హాఫ్‌సెంచరీలు కొట్టాడు.
 
కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్ర సింగ్‌ ధోనీ వీడ్కోలు పలికిన నిమిషాల్లోనే మరో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఐపీఎల్‌లో ధోనీ-రైనా జోడీ పదేళ్ల నుంచి  చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున ఆడుతున్నారు. 
 
యూఏఈ వేదికగా జరగనున్న  ఐపీఎల్‌-13లో పాల్గొనేందుకు చెన్నై ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరూ చెన్నైలోనే ఏర్పాటు చేసిన ట్రైనింగ్‌ క్యాంప్‌లో ఉన్నారు. 2005 జూలైలో శ్రీలంకపై రైనా తొలి వన్డే ఆడాడు.
 
 2010 జూలైలో లంకపైనే తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. తన కెరీర్‌లో 19 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో రైనా  రాణించలేకపోయాడు.   2018 జూలై17న ఇంగ్లాండ్‌తో వన్డేలో  ఆఖరి మ్యాచ్‌ ఆడాడు.