తెలంగాణలో గడీల పాలన అంతమొందించాలి 

తెలంగాణలో గడీల పాలన అంతమొందించాలి 

తెలంగాణలోని సాగుతున్న గడీల పాలనను అంతమొందించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపిచ్చారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూటీఆర్ఎస్ పార్టీకి సమాధి కట్టి.. అరాచక పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపాలని ఆయన కోరారు.

‘ రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తుంది. ఆ కాలంలో కింగ్ కోటి- ఫలక్ నూమా ప్యాలెస్ ల నుంచి రజాకార్ల పాలన నడిచినట్లే ఇప్పుడు ప్రగతి భవన్, ఫాం హౌస్ నుంచి కేసీఆర్ పాలన నడుస్తుంది. ఆనాడు రజాకార్లపై తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే… ఈనాడు రజాకార్ల వారసులను కేసీఆర్ పక్కన చేర్చుకున్నాడు’ అంటూ సంజయ్ ధ్వజమెత్తారు.

రజాకార్ల పాలనను అంతమొందించేందుకు ప్రజలు ప్రాణత్యాగం చేసిన సెప్టెంబర్ 17ను కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. ప్రాణ త్యాగం చేసిన అమరుల చరిత్రను చెరిపి.. కేసీఆర్ తన కుటుంబ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలనుకుంటున్నాడని దుయ్యబట్టారు.

కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ 7,000 కోట్లకు పైగా రాష్ట్రానికి కేటాయిస్తే  పైసా కూడా ఖర్చు చేయడం లేదని సంజయ్ ఆరోపించారు. మంచి జరిగితే తన ఖాతాలో.. చెడు జరిగితే కేంద్రం ఖాతాలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్నాడని విమర్శించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నెరవేర్చడం లేదని అంటూ  తన కుటుంబ రక్షణ, కమీషన్లకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ తీరు కారణంగా తెలంగాణలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని విచారం వ్యక్తం చేశారు.  కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా సంతోషంగా జరుపుకోవడం లేదని చెప్పారు. గడీల పాలన అంతమొందించి.. టీఆర్ఎస్ పార్టీకి సమాధి కట్టాలంటే రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త కష్టించి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.