అమిత్ షాకు నెగిటివ్, క్వారంటైన్ లో కేరళ సీఎం 

అమిత్ షాకు నెగిటివ్, క్వారంటైన్ లో కేరళ సీఎం 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఇవాళ(శుక్రవారం) జరిపిన కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపారు. 
 
ఈశ్వరుడి దయ వల్లే కరోనా నుంచి బయటపడ్డానంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కరోనా నుంచి తాను కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెపుతున్నానని తెలిపారు.
 డాక్టర్లు తనను మరి కొన్ని రోజులు హోం ఐసొలేషన్ లో ఉండమని చెప్పారని..వారి సలహాలను పాటిస్తానంటూ ఉంటానని చెప్పారు. తనకు చికిత్స అందించిన మేదాంత ఆసుపత్రి డాక్టర్లకు, ప్యారా మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు చెపుతున్నానని ట్వీట్ చేశారు.
 
 55 ఏళ్ల అమిత్ షా ఈ నెల 2 వ తేదీన కరోనా బారిన పడ్డారు.  అమిత్ షాకు నెగిటివ్ వచ్చిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అది తప్పని స్వయంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో షాకు నెగెటివ్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు. 
ఇలా ఉండగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వీయ క్వారంటైన్ విధించుకున్నారు. కోజికోడ్ విమానాశ్రయంలో గత వారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూలిన ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 18 మంది మరణించిన సంగతి తెలిసిందే.
 కాగా ప్రమాదం అనంతరం సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారుల్లో 22 మందికి కరోనా పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన వారిలో జిల్లా కలెక్టర్‌తోపాటు పోలీస్ అధికారి కూడా ఉన్నారు.
మరోవైపు సీఎం విజయన్ కూడా నాడు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీంతో సీఎంతో పాటు ఆయన వెంట ఉన్న అధికారులు క్వారంటైన్‌లో ఉంటారని సీఎం కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార, దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ జాతీయ జెండాను ఎగురవేస్తారని పేర్కొంది.