ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు మృతి

జ‌మ్ముక‌శ్మీర్ లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. శుక్ర‌వారం ఉదయం శ్రీనగర్‌ శివారులోని నౌగామ్ ప్రాంతంలో పోలీసుల బృందం వెళుతున్న కాన్వాయ్ పై దాడి చేశారు. ఈ ఘటనలో జమ్మూ అండ్ కశ్మీర్ కు చెందిన ఇద్దరు పోలీసులు మరణించారు. 

మ‌రొక‌రుల తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. బైపాస్ రహదారిలో కాన్వాయ్ వెళుతుండగా, ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారని, గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, ఇద్దరు చికిత్స పొందుతూ అమరులయ్యారని క‌శ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ లో పేర్కొన్నారు. 

ఆ ప్రాంతాన్ని అదనపు బలగాలు చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ప్రారంభించాయని తెలిపారు. మరికొన్ని గంటల్లో స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చంటూ ముందుగానే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో హై అలర్ట్ లో ఉండే ప్రాంతంలో దాడి జరగడం గమనార్హం.

మృతులను ఇస్ఫాఖ్ ఆయుబ్ (715 IRP 20 బెటాలియన్), ఫయాజ్ అహ్మద్ (307 IRP 20 బెటాలియన్)గా గుర్తించారు. సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ మహమ్మద్ అష్రాఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులే కాల్పులు జరిపారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనతో పోలీసులతో పాటు ఆర్మీ ద‌ళాలు అప్రమత్తమయ్యాయి.