ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం పడకలు కరొనకే 

ప్రైవేట్ హాస్పిటళలోని సగం పడకలను ప్రభుత్వానికి  ఇచ్చేందుకు ఆ ఆస్పత్రుల మేనేజ్ మెంట్స్ అంగీకరించాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు.  తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (టీషా) ప్రతినిధులతో జరిపిన భేటీ అనంతరం వీటిలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే ట్రీట్ మెంట్ అందిస్తారని చెప్పారు. 
 
ఈ పడకలను వైద్యారోగ్య శాఖనే భర్తీ చేస్తుందని, ఇందుకోసం ప్రత్యేక యాప్‌‌ను వినియోగిస్తామని తెలిపారు. పూర్తి విధివిధానాలు రూపొందించేందుకు ప్రైవేట్ హాస్పిటళ్ల మేనేజ్ మెంట్స్ తో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం సమావేశం కానున్నారు. 
 
కరోనా చికిత్స అందించడం కోసం ప్రభుత్వం మొదటి నుంచి తమతో కలసి రావాలని ప్రైవేట్ హాస్పిటల్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నా ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రాలేదని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కాకుండా అధిక ఫీజులు తీసుకున్నందుకు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేఖిత వచ్చిందని పేర్కొన్నారు. 
 
ఈక్రమంలో సిఎం ఆదేశాల మేరకు జి.ఓను ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రైవేట్ దోపిడిపై లిఖిత పూర్వకంగా వెయ్యికి పైగా ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. 
 
ఇప్పటికే వీటిలో కొన్నిటికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, మరిన్ని హాస్పిటల్స్‌కు హెచ్చరికలు జారీ చేశామని, రెండు ఆసుపత్రులకు అనుమతులు కూడా రద్దు చేశామని వివరించారు. 
 
కరోనా వైద్యం అందించేందుకు సుమారు 100కు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ముందుకు రాగా, 50 హస్పిటల్స్‌పై ఫిర్యాదులు రావడం దారుణమని మంత్రి మండిపడ్డారు. సంక్షోభ సమయంలో కూడా వ్యాపారం చేయవద్దని పలుమార్లు హెచ్చరించినా మాట వినకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పారు.