దేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రానికి రావడం శుభపరిణామమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీ రాకతో రైల్ కోచ్ తయారీలో రాష్ట్రం నూతన ఒరవడిని సృష్టించనుందని పేర్కొన్నాన్నారు.
గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో సుమారు రూ.1000 కోట్లతో నెలకొల్పనున్న మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లతో కలిసి మంత్రి భూమి పూజ నిర్వహించారు.
తెలంగాణలో ఇప్పటికే విమానాలు, హెలికాప్టర్లు, ట్రాక్టర్లు, బస్సుల విడి భాగాలు తయారవుతున్నాయని, ఇప్పుడు రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు చెందిన మేధా సర్వో కంపెనీ ప్రపంచ స్థాయి రైల్ కోచ్ ఫ్యాక్టరీని స్థాపించడం గర్వకారణమని మంత్రి చెప్పారు.
మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భారత దేశపు అతి పెద్ద ప్రయివేటు రంగ రైల్ కోచ్ ఫ్యాక్టరీగా అవతరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొండకల్ శివారులో 100 ఎకరాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. 2022 నాటికి ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కంపెనీ రావడం వల్ల ప్రత్యక్షంగా 2200 మంది (1000 మందికి ప్రత్యక్షంగా, మరో 1200 మందికి పరోక్షంగా) నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందులో సంవత్సరానికి వివిధ రకాల 500 కోచ్‌లు, మరో 50 లోకోమేటివ్ కోచ్‌లను తయారు చేసే లక్షంగా కంపెనీ పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించాయి.
More Stories
ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
ఎస్డిఎఫ్ నిధులతోపాటు ఖమ్మంకు అదనంగా సాయం
నివాసముంటున్న ఇళ్లు కూల్చం