రోజుకు 40 వేల టెస్ట్ చేస్తామన్నారు గదా కేసీఆర్ 

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఘనం, చేతలు మాత్రం సూన్యం వలే ఉంటుంది. తెలంగాణలో ప్రతి రోజూ 40 వేల కరోనా టెస్టులు చేయాలని ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 5న నిర్ణయించింది. కానీ ఆ రోజు నుంచిఇప్పటివరకు రోజూ చేస్తున్న టెస్టులు 24 వేలు కూడా దాటడం లేదు.
సగటున 20,808 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. దీంతో కేబినెట్ నిర్ణయం ఉత్తదేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణలో టెస్ట్ లను బాగా పెంచాలని కేసీఆర్ గారితోనే చెప్పారు. అయినా ప్రభుత్వం చలనం కనబడటం లేదు.
అసలు టెస్ట్ లు చేసేందుకు తెలంగాణ ఆరోగ్య శాఖ సిద్ధంగా లేదా?  లేక ప్రభుత్వమే టెస్టు లు తక్కువ చేయాలని చెబుతున్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కరోనా టెస్ట్ లు పెంచడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తున్నదో అర్ధం కావడం లేదు.
టెస్టింగ్‌ కిట్లు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉన్నా, అవసరమైన సహకారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా, టెస్టుల కోసం జనం  ఇబ్బంది పడుతున్నా. అంతంతమాత్రంగానే  ఎందుకు టెస్టులు చేస్తున్నారు? చివరకు హైకోర్టు సహితం మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం  లేదు.
ఎన్ని టెస్టులైనా చేస్తామని కేసీఆర్, ఆరోగ్య మంత్రి మాటలు చెబుతున్నారు గాని ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. మొదటి నుండి కరోనా టెస్ట్ ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం దొంగాట ఆడుతున్నది. 
తెలంగాణలో మార్చి రెండో వారం నుంచిగాంధీ హాస్పిటల్లో టెస్టులు చేయడం ప్రారంభించారు. మార్చి నుంచి ఏప్రిల్ రెండో వారం వరకూ అవసరమైన మేర టెస్టులు చేశారు. కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్‌‌20 నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ కు టెస్టులు చేయడం ఆపేశారు.
దీంతో ఇతర రాష్ట్రాల్లో మే చివరి నాటికి టెస్టుల సంఖ్య లక్షల్లోకి చేరితే మన దగ్గర 27 వేల దగ్గరే ఆగిపోయింది. టెస్టుల కోసం జనం ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో తక్కువ టెస్టులపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి.
 
 ప్రజల నుంచి కూడాఒత్తిడి పెరగడంతో జూన్‌లో టెస్టుల సంఖ్య కొద్దిగా పెంచక తప్పలేదు. దీంతో కేసులు పెరిగాయి. జూన్ 16 నాటికి ఏపీలో 5,83,286 టెస్టులు చేస్తే, తెలంగాణలో  44,431 టెస్టులు  మాత్రమే చేశారు. అప్పటికి ఏపీలో 6,720 కేసులు నమోదైతే, ఇక్కడ 5,406 నమోదయ్యాయి.
 
ఏపీలో పాజిటివ్‌‌రేట్ 1.15 శాతం ఉంటే, తెలంగాణలో 12.16 శాతానికి పెరిగింది. అయినా, ఏపీ సర్కార్‌ టెస్టులు సంఖ్యను పెంచుతూనే పోయింది. కానీ తెలంగాణ  సర్కార్ మాత్రం పెంచుతున్నామనే ప్రకటనలే తప్ప పెంచలేదు.