‘న్యాయమూర్తులపైనే కుట్రలకు దిగుతారా’.. అంటూ ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ న్యాయచరిత్రలోనే ఇదో పెద్ద కుట్రకోణమని, న్యాయవ్యవస్థలో ఇదొక అసాధారణమైన కేసు అని పేర్కొంది. ఇలాంటి కుట్రలు న్యాయవ్యవస్థకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేసింది.
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను నిలబెట్టేందుకు వీటిని ఛేదించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా న్యాయాధికారి ఎస్.రామకృష్ణ, ఓ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఈశ్వరయ్యలమధ్య జరిగిన సంభాషణపై వాస్తవికతను, ప్రామాణికతను తేల్చాలని నిర్ణయించింది. ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్‌ను నియమించింది.
ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చి, నివేదిక సమర్పించాలని విజ్ఞప్తి చేసింది. ఆయనకు సహకరించాలని సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, హైకోర్టు ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యుడు లక్ష్మీనరసయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
అయితే దీని వెనుక కుట్ర ఉందని, ఇందుకు తన వద్ద సాక్ష్యాలున్నాయని, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి.ఈశ్వరయ్య తనతో జరిపిన సంభాషణను పరిశీలించాలని సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్.రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సంభాషణకు సంబంధించిన ఆడియో పెన్‌డ్రైవ్‌ను, ఆంగ్ల తర్జుమా కాపీని కూడా సమర్పించారు.
ఆ ఇద్దరు వ్యక్తుల ఫోన్ సంభాషణను పరిశీలిస్తే ప్రాథమికంగా కుట్ర కోణం ఉన్నట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం పేర్కొంది. దీనిని న్యాయవ్యవస్థపైనే కుట్రగా అభివర్ణించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడాలంటే క్షుణ్ణంగా విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కుట్ర పన్నినట్లు అవగతమవుతోందని పేర్కొంది.
రాష్ట్ర హైకోర్టు చరిత్రలోనే ఇది దురదృష్టకరమైన ఏహ్య సంఘటన అని తెలిపింది. తాము కేవలం ఇంప్లీడ్ పిటిషన్ ఆధారంగానే ఈ ఆదేశాలు జారీ చేయడం లేదని, హైకోర్టు సీజేకి వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేశారని, ఇది అంత సులభంగా వదిలేసే అంశం కాదని స్పష్టం చేసింది.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!