పీవోకేలో చైనాపై భారీ నిరసనలు 

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది. చైనా పాక్ ఆర్థిక కారిడార్‌లో భాగంగా అక్కడి నీలం-జీలం నదిపై ఆజాద్ పట్టన్, కోహాలా జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చైనాతో పాకిస్థాన్ జూన్ నెలలో ఒప్పందం చేసుకున్నది. దీంతో చైనా కంపెనీలు ఈ నదిపై భారీ డ్యాములను నిర్మించనున్నాయి. 

కాగా పీవోకే ప్రజలు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి ముజఫరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘నదిని కాపాడుకుందాం.. ముజఫరాబాద్‌ను కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు ఆ దేశ జెండాలను తగులపెట్టారు.

కాగా, ఒకప్పుడు నీళ్లతో పరవళ్లు తొక్కే నీలం-జీలం నది ఇప్పుడు మురుగునీటి కాలువగా మారిందని, స్థానికుల తాగునీటి అవసరాలు తీరడం లేదని పీవోకేకు చెందిన సామాజిక వేత్త డాక్టర్ అమ్జాద్ మీర్జా ఆవేదన వ్యక్తం చేశారు.

చైనా పాకిస్థాన్ ఇకనామిక్ కారిడార్ పేరుతో ఆ దేశ కంపెనీలు పీవోకేలోని సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. డ్యాముల నిర్మాణం కోసం చైనా కంపెనీలు నదిని మళ్లించడంతో మజఫరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పీఎంకే ప్రజలు ఎన్ని నిరసనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అమ్జాద్ మీర్జా వాపోయారు. చైనా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నదని, ఇదంతా ఎవరు చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ భారమంతా పీవోకే ప్రజలపై పడుతుందని, దీంతో ఇక్కడి ప్రజలు మరింతగా పేదరికంలో కూరుకుపోతారని అమ్జాద్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలా ఉండగా, సరిహద్దుల్లో చైనా కుట్రల కారణంగా రెండుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత ప్రభుత్వ చమురు సంస్థలు చైనా షిప్పులను అద్దెకు తీసుకోరాదని నిర్ణయించాయి. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తదితర సంస్థలు విదేశాల నుంచి చమురు, చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు చైనా నౌకలను అద్దెకు తీసుకుంటుంటాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటిస్థానంలో వేరేదేశాల నౌకలు వాడాలని నిర్ణయించినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.