ప్రైవేట్ హాస్పిటల్స్ లో ధరల పట్టిక ఉండాల్సిందే 

డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది వాడుతున్న పీపీఈ కిట్ల ధరలు, కరోనా రోగులకు ఇస్తున్న ఖరీదైన మందుల ధరలు, టెస్టుల ధరలు అన్నింటినీ రోగులకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రైవేట్ హాస్పిటళ్లకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ  ఆదేశాలు జారీ చేసింది.
 
 హాస్పిటల్‌ మొదట్లోనే ఈ బోర్డులు ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే, రోగులకు ఇచ్చే బిల్లును వివరంగా ఇవ్వాలని సూచించింది. ఏయే మందులు వాడారు, వాటికి ఎంత చార్జ్ వేశారు,  ఏయే టెస్టులు చేశారు, వాటికి ఎంత చార్జ్ వేశారు, పీపీఈ కిట్లు ఎట్లెట్ల వాడారు, వాటికి ఎంత చార్జ్‌  వేశారు వంటి పూర్తి వివరాలను బిల్లులో పేర్కొ నాలని ఆదేశించింది. 
 
కరోనా రోగులకు అడ్డగోలుగా చార్జ్‌ చేయడం, దేనికి ఎంత చార్జ్ వేశారో చెప్పకపోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు రావడంతో ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ప్రజారోగ్య  డైరెక్టర్‌‌  డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఉత్తరువులు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. 
 
బోర్డులు ఏర్పాటు చేయకపోయినా, బిల్లులు వివరంగా ఇవ్వకపోయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో లేని టెస్టులకు గతేడాది డిసెంబర్‌‌ నాటి రేట్ల ప్రకారమే చార్జ్‌ చేయాలని మరోసారి సూచించారు. అంతకంటే ఎక్కువ వసూలు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.