పాక్ – సౌదీ మధ్య చిచ్చు పెట్టిన కాశ్మీర్ 

కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా భారత్ కు పెరుగుతున్న మద్దతుతో పాకిస్తాన్ ఒంటరిగా మిగులుతుంది. పాకిస్థాన్ కు రాజకీయంగానే కాకుండా ఆర్ధికంగా చిరకాలంగా దన్నుగా నిలబడుతున్న సౌదీ అరేబియాతో ఇప్పుడు బంధం విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 
ఒక బిలియన్ అమెరికా డాలర్ల రుణాన్ని సౌదీ అరేబియాకు పాకిస్థాన్ గడువు ముందుగా గత వారం తీర్చివేసింది. మరోవైపు సౌదీ నుంచి పాకిస్థాన్ రాయితీ ధరకు ఆయిల్ పొందలేకపోతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దూరం మరింతగా పెరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.  కశ్మీర్ అంశమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. 
 
జమ్ముకశ్మీర్‌కు వర్తించే ప్రత్యేక ప్రతిపత్తిని గత ఏడాది ఆగస్టు 5 భారత ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభించిన సంగతి తెలిసిందే. దీనిపై గుర్రుగా ఉన్న పాకిస్థాన్ ఈ అంశంపై 57  ముస్లిం దేశాల కూటమి అయిన ఓఐసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ అరేబియాను కోరింది. 
 
ఓఐసీలో ఆధిపత్యమున్న సౌదీ పాక్ విన్నపాన్ని పట్టించుకోలేదు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి దీనిపై బహిరంగంగానే సౌదీ అరేబియాను విమర్శించారు. సౌదీ ముందుకు రాకపోతే కశ్మీర్ అంశంపై తమతో కలిసి వచ్చే ముస్లిం దేశాలతో తామే సమావేశాన్ని నిర్వహిస్తామని ఒక ఇంటర్యూలో బెదిరించారు. దీనిపై ఆ దేశంలో విమర్శలు వచ్చాయి.
 
మరోవైపు కశ్మీర్‌పై ముస్లిం దేశాల మద్దతును కూడగట్టేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మే 22న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిపై మీడియాతో మాట్లాడుతూ తమకు గొంతు లేదని, ముస్లిం దేశాల్లోనే విభజన ఉన్నదని అంగీకరించారు. కశ్మీర్ అంశంపై ఓఐసీ సమావేశం కోసం సభ్య దేశాలు కలిసి రాలేకపోయాయని విచారం వ్యక్తం చేశారు. 
 
దీంతో పాక్ తీరుపై సౌదీ ప్రిన్స్ సల్మాన్‌కు ఆగ్రహం కలిగినట్లు తెలుస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సౌదీ నుంచి అప్పు పొందిన మూడు బిలియన్ల అమెరికా డాలర్లలో ఒక బిలియన్‌ను గతవారం పాక్ తిరిగి చెల్లించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. చైనా నుంచి నిధులు అందిన వెంటనే మిగతా 2 బిలియన్ డాలర్ల రుణాన్ని కూడా సౌదీకి పాక్ చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. 
 
ఈ రుణంతోపాటు సౌదీ నుంచి రాయితీ ధరకు ఆయిల్ పొందే ఒప్పందం ఇటీవల ముగిసింది. దీనిని మరో రెండేండ్లకు పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ఈ దిశగా చొరవ చూపడం లేదని తెలుస్తున్నది.