కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది

కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది

ఆర్థికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొవిడ్-19 కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఈ సంక్షోభం తలెత్తక పోయి ఉంటే రానున్న ఏడెనిమిది ఏళ్లలో భారత్ ప్రపంచంలోని మూడు అగ్ర దేశాలలో ఒకటిగా మారి ఉండేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కనెకింగ్, కమ్యూనికేటింగ్ అండ్ చేంజింగ్ అనే పుస్తకం కాఫీ  టేబుల్ ప్రతిని ఆవిష్కరిస్తూ  భారతదేశం ఆర్థికంగా బలపడుతున్న దశలో ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు బాధ్యతలు నిర్వర్తించడం మన అదృష్టమని కొనియాడారు. 

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రతిష్టను ప్రపంచానికి బలంగా ఆయన చూపించగలిగారని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని దెబ్బతీయకుంటే వచ్చే ఏడెనిమిది సంవత్సరాలలో మన దేశమే ప్రపంచంలోని మూడు అగ్ర రాజ్యాలలో ఒకటిగా నిలిచేదని ఆయన పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్న కారణంగా మనం అది సాధించగలమన్న నమ్మకం ఉందని రాజ్‌నాథ్ చెప్పారు.

ఈ పుస్తకం శీర్షిక వెంకయ్య నాయుడు తన జీవితంలో ఆచరించే సిద్ధాంతాలను తెలియచేస్తుందని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ పుస్తకంలో వెంకయ్య నాయుడు ఉపన్యాసాలు చాలా ఉన్నాయని, పాఠకులకు కొత్త జ్ఞానాన్ని ఇవి ప్రసాదించగలవని ఆయన చెప్పారు. వెంకయ్య నాయుడు హయాంలో పార్లమెంట్ సమావేశాలు ఎంతో ఫలప్రదంగా జరుగుతున్నాయని ఆయన కొనియాడారు. 

250 పేజీలతో ఈ పుస్తకాన్ని ప్రచురణల విభాగం రూపొందించింది. భారతదేశంలోనూ, విదేశాలలోనూ, ఉపరాష్ట్రపతి చేసిన ప్రయాణాలతో సహా వివిధ రకాలైన కార్యకలాపాలను కథనాలు చిత్రాల ద్వారా ఈ పుస్తకంలో పొందుపరిచారు. రైతులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, యువత, నిర్వాహకులు, పరిశ్రమ నాయకులు మరియు కళాకారులతో, ఇతరులతో పరస్పర చర్చల సంగ్రహ స్వరూపాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. 

ఉపరాష్ట్రపతి విదేశీ సందర్శనలకు సంబంధించిన సంఘటనలు, ప్రపంచ నాయకులతో ఆయన జరిపిన సంభాషణలు మరియు వివిధ దేశాల్లోని భారతీయ ప్రవాసులనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.
 
కమ్యూనికేషన్ ద్వారా ప్రజలతో అనుసంధానం అవ్వడం గురించీ, భారతదేశాన్ని మార్చడం గురించీ, ఈ పుస్తకం తెలియజేస్తుందని జవదేకర్ తెలిపారు. పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ప్రసంగాలు ఆలోచనలు ,భావోద్వేగాలతో నిండి ఉన్నాయని, భాషలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని ఆయన చెప్పారు.