మళ్ళీ ప్రధానిగా మోడీకే పట్టం

ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోడీకే జనాలు పట్టం కట్టారు. ఈ సర్వేలో 66 శాతం మంది తదుపరి ప్రధానిగా మోడీకే ఓటు వేశారు. ప్రజలలో ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానిగా ఉన్నారు.

ఈ సర్వేలో తదుపరి ప్రధానిగా హోమ్ మంత్రి అమిత్ షా 4 శాతం, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ 3 శాతం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 3 శాతం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 2 శాతం, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 2 శాతం, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శరద్ పవార్, ఉద్దవ్ థాక్రే, మాయావతి 1శాతం ఓట్లు సాధించారు. 

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 8 శాతం ఓట్లతో రెండవ స్థానంలో, 5 శాతం ఓట్లతో సోనియా గాంధీ మూడవ స్థానంలో నిలిచారు. 

కాగా ఉత్తమ ప్రధానిగా మోడీ తర్వాత రెండవ స్థానాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయి 14 శాతం ఓట్లతో, ఇందిరా గాంధీ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అలాగే, జవహర్‌లాల్ నెహ్రూ, మన్మోహన్ సింగ్‌లు ఒక్కొక్కరికి 7 శాతం ఓట్లు, లాల్ బహదూర్ శాస్త్రి 5 శాతం ఓట్లు సాధించారు.

జనవరి 2020లో నిర్వహించిన సర్వేలో కూడా  ప్రధాని నరేంద్ర మోడీ తదుపరి ప్రధానమంత్రి ఎంపికగా ఎన్నుకున్నారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీల మధ్య 40 శాతం పాయింట్ల అంతరం ఉంది. 53 శాతం మంది నరేంద్ర మోడీని తదుపరి ప్రధానిగా పేర్కొనగా,  13 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీని ప్రధానిగా ఎన్నుకుంటామన్నారు.

అయితే జనవరి 2019లో నిర్వహించిన సర్వేలో రాహుల్ గాంధీ ప్రధాని పదవికి ప్రతిపక్ష నాయకులలో ఉత్తమంగా సరిపోయే అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఆ సర్వేలో ఆయనకు అనుకూలంగా 52 శాతం ఓట్లు వచ్చాయి. ఇక భారత్-చైనా సరిహద్దు గొడవల గురించి ప్రజలను ప్రశ్నించగా దాదాపు 60 శాతం మంది చైనాతో యుద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలిపగా.. 34 శాతం మంది మాత్రం యుద్ధానికి వ్యతిరేకమన్నారు.