అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా లేకుండా కృష్ణా, గోదావరి నదుల మీద కొత్త ప్రాజెక్టులు నిర్మించవద్దనికేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. వారికి వ్రాసిన లేఖలలో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి సంబంధించి చర్చించడానికి వీలైనంత త్వరగా భేటీ కావాలని కోరారు.
రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని షెకావత్ విమర్శించారు. 2016 సెప్టెంబర్ లో ఒకసారి మినహా ఇప్పటివరకు మళ్లీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగలేదని లేఖలో గుర్తు చేశారు. అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిందని పేర్కొన్నారు.
విభజన చట్టం సెక్షన్ 84(3) ప్రకారం అపెక్స్ కౌన్సిల్ గోదావరి, కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డులపై పర్యవేక్షణ అధికారాలు కలిగి ఉందని తెలిపారు. 2018 ఫిబ్రవరి, 2020 జనవరిలో జలశక్తి శాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్షలో అనేక అపరిష్కృత అంశాలను గుర్తించారని గుర్తు చేశారు.
వాటిని పరిష్కరించడం కోసం అపెక్స్ కౌన్సిల్ 2019 సెప్టెంబర్లో ఎజెండా సిద్ధం చేయాలని రెండు రాష్ట్రాలను కోరామని తెలిపారు.మే 2020లో జలశక్తి శాఖ మరోసారి రాష్ట్రాలకు గుర్తుచేస్తూ లేఖలు రాసిందని అయినా అ లేఖలపై ఎలాంటి స్పందన లేదని కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు.
2020 మే 14న గోదావరి బోర్డుకు ఏపీ సర్కారు ఏడు తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరాలు చెబుతూ లేఖ రాసిందని తెలిపారు. ఏపీ సర్కారు అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని చెప్పారు.
అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-3, సీతారామ లిఫ్ట్, తుపాకులగూడెం, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, పెన్‌గంగాపై నిర్మించిన బ్యారేజులు రామప్ప – పాకాల సరస్సుల నీటి దారి మళ్లింపు ఉన్నాయని వివరించారు. జూన్ 5న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టులపై లోతుగా చర్చ జరిగిందని చెప్పారు.
కాగా, వాటి డీపీఆర్‌లను జూన్ 10లోగా అందజేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి బోర్డు ఆదేశించగా తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు సమర్పించలేదని కేంద్రమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఆ డీపీఆర్‌లు సమర్పించకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందకుండా నిర్మాణం జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి జలశక్తి శాఖ స్పష్టం చేసినదని కేంద్ర మంత్రి తెలిపారు.
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్