ఏపీలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేన్నట్లేనా!

గత మార్చిలో కరోనా కారణంగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవలే పాత ఆర్డినెన్స్‌కు కాలం చెల్లడంతో ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. 
 
ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసింది. 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ప్రత్యేకాధికారుల పాలన డిసెంబర్‌ 31 లేదా పాలకవర్గం ఏర్పాటయ్యే వరకూ పొడిగించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన అక్టోబర్‌ 10 వరకూ పొడిగించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ 2021 జనవరి 2 తేదీ వరకూ ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పురపాలక శాఖ స్పష్టం చేసింది.

కోవిడ్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయటంతో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు పురపాలక శాఖ స్పష్టం చేసింది. మొత్తానికి చూస్తే మొన్న ఆర్డినెన్స్, ఇప్పుడు పొడిగింపుకు సంబంధించిన ఉత్వర్వులను బట్టి చూస్తే ఇప్పట్లో ఎన్నికలుండవని ప్రభుత్వం సంకేతాలిచ్చిందని స్పష్టం అవుతుంది.