ప్లాస్మా థెరపీ నిష్ప్రయోజనం

కరోనా రోగుల్లో మరణ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్లాస్మా థెరపీ ఎలాంటి ప్రయోజనం చూపించడం లేదని ఎయిమ్స్‌లో నిర్వహించిన మధ్యంతర విశ్లేషణలో బయటపడింది. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి యాంటీబాడీలను సేకరించి యాక్టివ్ కరోనా రోగుల్లో మార్పిడి చేయడం ప్లాస్మా థెరపీ ప్రక్రియ. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి వైరస్‌ను ఎదుర్కొంటుందని నమ్ముతుంటారు. 

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఒక వార్తాసంస్థకు గురువారం ఇచ్చిన ఇంటర్వూలో దాదాపు 30 మంది కరోనా రోగుల్లో ప్లాస్మా థెరపీ ప్రయోగం నిర్వహించగా వైరస్ వల్ల కలిగే హానిని నివారించడంలో ఈ థెరపీ ఎలాంటి ప్రయోజనం చూపించలేదని చెప్పారు. ఈ ట్రయల్‌లో ఒక గ్రూపు కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ ఇవ్వగా, మరోగ్రూపు రోగులకు కేవలం ప్రామాణిక చికిత్స అందించారు.

ఈ రెండు గ్రూపుల్లో మరణాలు ఏమాత్రమో పరిశీలించగా తేడా ఏమీ కనిపించలేదు. రోగుల్లోనూ ఎలాంటి మెరుగుదల కనిపించలేదని ఆయన వివరించారు. ఏదేమైనా ఇది మధ్యంతర విశ్లేషణ మాత్రమే. ఈ థెరపీని మరింత అధ్యయనం చేస్తే కానీ ఏదీ నిర్ధారించలేమని ఆయన చెప్పారు. రోగుల్లో ఉపసమితి కొంతవరకు ఈ థెరపీ వల్ల ప్రయోజనం పొందగలరని పేర్కొన్నారు. 

కరోనా వైరస్‌పై జాతీయ స్థాయిలో బుధవారం జరిగిన మూడో సదస్సులో తేలికపాటి లక్షణాలున్న కరోనా రోగుల నుంచి తీవ్ర లక్షణాలున్న రోగుల వరకు ఈ ప్లాస్మా థెరపీ ప్రభావంపై చర్చించడమైందని తెలిపారు. ప్లాస్మా ప్రక్రియ సురక్షితమే. అయితే, దీని సమర్థతకు సంబంధించి ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు.

అందువల్ల చికిత్సలో దీని వినియోగంపై జాతీయ మార్గదర్శకాల పరిధిలో న్యాయాన్యాయాలు నిర్ణయించవలసి ఉందని ఎయిమ్స్ మెడిసిన్ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ మోనిష్ సోనెజా సూచించారు. కరోనా ప్రాథమిక దశలో దీన్ని వినియోగించ వచ్చని, కొన్ని లక్షణాలు కలిగిన కరోనా రోగులు ప్లాస్మా థెరపీతో ప్రయోజనం పొందగలుగుతారని తెలిపారు. అయితే, ఆ లక్షణాలు ఏమిటో తమకు తెలియవని చెప్పారు.

కరోనా రోగులు తాలూకు బంధువులు ప్లాస్మా థెరపీ గురించి అడగడం లేదు. వైద్యం చేస్తున్న డాక్టర్ ఈ థెరపీ రోగికి అవసరమని చెబితే తప్ప ఎవరూ ఈ థెరపీని కావాలని కోరడం లేదని డా. నీరజ్ నిశ్చల్ చెప్పారు. వ్యాధి ప్రారంభ దశలో కొంతవరకు దీనివల్ల ప్రయోజనం ఉండవచ్చని చెప్పారు. ప్లాస్మా థెరపీ సమర్థమైనదైతే వ్యాధికి వ్యతిరేకంగా తగినన్ని యాంటీ బాడీల తటస్థీకరణ చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.

ఈ థెరీపీ వల్ల కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. రక్తం నుంచి వచ్చే అంటువ్యాధులు ఈ ప్రక్రియలో వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. సీరం భాగాలపై వ్యతిరేక ప్రభావం ఏర్పడవచ్చు. రోగనిరోధక ప్రతిచర్యలపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. దానివల్ల రోగి పరిస్థితి మరింత అధ్వాన్న మౌతుందని డాక్టర్ నిశ్చల్ అభిప్రాయం వెలిబుచ్చారు.