పాన్‌గాంగ్ సరస్సు ప్రాంతం నుంచి తమ దళాలను ఉపసంహరించేది లేదని చైనాకు భారత్ తేల్చిచెప్పింది. తూర్పు లడాఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గించే నేపథ్యంలో రెండు దేశాల సైనిక అధికారులు మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే గత సమావేశంలో చైనా పెట్టిన డిమాండ్ ను భారత దళాలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
ఫింగర్-3 వద్ద ఉన్న ధాన్ సింగ్ థప్పా పోస్టు నుంచి భారత దళాలు వెనక్కి జరగాలని చైనా డిమాండ్ చేసింది. కానీ చైనా చేసిన అభ్యర్థనను భారత్ తిరస్కరించింది. ఫింగర్-3 వద్ద ఉన్న పోస్టు భారత భూభాగంలో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కమాండర్ స్థాయి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో పాన్‌గాంగ్ సరస్సు వద్ద దళాలు అలాగే ఉండిపోయాయి.
ఒకప్పుడు భారతీయ దళాలు పెట్రోలింగ్ చేసిన ప్రాంతంలో ఇప్పుడు చైనా దళాలు ఆక్రమించినట్లు తెలుస్తోంది. పాన్‌గాంగ్ సరస్సు నుంచి చైనా దళాలను వెనక్కి పంపేందుకు మరోసారి ఆ దేశంతో చర్చలు నిర్వహించాల్సి ఉంటుందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.
గాల్వన్ దాడి ఘటన తర్వాత చైనా, భారత సైనిక అధికారుల మధ్య అయిదుసార్లు చర్చలు జరిగాయి. దీప్‌సాంగ్ ప్లేయిన్స్, గోగ్రా, పాన్‌గాంగ్ ఫింగర్ ప్రాంతాల్లో ఇంకా చైనా దళాలు తిష్టవేసి ఉన్నాయి. ఫింగర్ ఫోర్ నుంచి ఫింగర్ 8 వద్ద మధ్య ఉన్న దళాలను చైనా ఉపసంహరించుకోవాలని భారత్ వత్తిడి తెస్తూనే ఉన్నది.
కాగా, సరిహద్దులపై నిత్యం నిఘా ఉంచేందుకు ఉపగ్రహాల సాయం తీసుకోవాలని భారత్ నిర్ణయించింది. భారత్, చైనాల మధ్య సరిహద్దు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది. హద్దుల వెంబడి రోజంతా నిఘా పెట్టేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రత సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఉపగ్రహాలు కేవలం సరిహద్దులపై నిఘాకు ఉపయోగిస్తారు. చైనా ఇటీవల జిన్‌జియాంగ్ ప్రాంతంలో మిలటరీ విన్యాసాల పేరుతో సుమారు 40 వేల మంది సైనికులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని అతితక్కువ కాలంలో తరలించగలిగింది.
మరోవంక, తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కుకు చైనాకు లేదని భారత్ స్పష్టం చేసింది. కశ్మీర్ అంశాన్ని భద్రత మండలిలో లేవనెత్తేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని నిరసించడమే కాకుండ. ఇతరుల జోక్యం సరికాదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో కశ్మీర్ అంశంపై చర్చ జరగాలని పాకిస్తాన్ ప్రతిపాదించగా చైనా దానిని మద్దతు ఇచ్చింది.
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దయి బుధవారానికి ఏడాదైన విషయం తెలిసిందే. చైనా ప్రయత్నాలు ఫలించలేదు. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ అంశాలను చైనా భద్రతా మండలిలలో ప్రస్తావించే ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో మాదిరిగానే దేశ అంతర్గత వ్యవహారాలపై చైనా జోక్యం చేసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’