రాజధాని అంశంలో సంబంధం లేదన్న కేంద్రం 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుందని కేంద్ర హోమ్ శాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో తమ విధానాన్ని వెల్లడించింది. 
 
 ఏపీ రాజధానిగా గత ప్రభుత్వం అమరావతిని నిర్ణయించగా, తాజాగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి, గవర్నర్‌తో కూడా దానికి ఆమోద ముద్ర వేయించింది. ఈ వివాదంపై ఏపీ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని దాఖలైన అఫిడవిట్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది.

పునఃవిభజన చట్టంలోని సెక్షన్ 6 అవర్ ప్రకారం రాజధానిని ఎంపిక చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించామని కేంద్రం చెప్పింది. 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని, అప్పుడు కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని తెలిపింది. 

ప్రస్తుత ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికి జూలై 31న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. పునఃవిభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరువేరుస్తామని, స్పెషల్ కేటగిరీ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. 

పోలవరం ప్రాజెక్టుకు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులందిస్తున్నామని, ఇప్పటికే ఏపీకి రూ.1,400 కోట్లు ఇచ్చామని కేంద్రం తెలియజేసింది. కాగా,  చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది.

కాగా, ఈ సందర్భంగా పిటీషన్‌‌లపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకూ రూ 52,000 కోట్లు వ్యయం చేశారని సీఆర్డీఏ రికార్డును హైకోర్టు న్యాయవాది ఉన్నం మురళీధర్ చూపించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘నేటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ ఆ నిర్మాణం ఆగింది?’ తదితర వివరాలు కావాలని ఆదేశించింది. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా… అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

‘బిల్డింగ్‌లు ఎన్ని పూర్తయ్యాయి..?.ఎక్కడ ఆగిపోయాయి…? ఎంత వ్యవయం చేశారు..? కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులివ్వాలి..?’ వంటి వివరాలన్నీ వెంటనే సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి పాడైపోతాయి కదా… ఆ నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించింది.

రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు?.. 52 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.