పాక్ విమర్శలను తోసిపుచ్చిన భారత్ 

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనుల ప్రారంభంపై పాకిస్థాన్  విమర్శలను భారత్‌ తోసిపుచ్చింది. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం పొరుగుదేశం మానుకోవాలని హితవు పలికింది. భారత అంతర్గత విషయాల్లో తలదూర్చడం సరికాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ పాక్‌కు చురకలు అంటించారు. 

భారత వ్యవహారాల్లో పాకిస్తాన్‌ ప్రకటనలను పరిశీలించామని, తమ అంతర్గత వ్యవహారాల్లో పొరుగుదేశం జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు.  మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆయన పాకిస్థాన్ ను హెచ్చరించారు. 

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, తమ దేశంలో మైనారిటీల మతపరమైన హక్కులను నిరాకరిస్తున్న పొరుగుదేశం వైఖరి ఆశ్చర్యం కలిగించకపోయినా ఇలాంటి వ్యాఖ్యలు విచారకరమని ఆయన ధ్వజమెత్తారు. 

 రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమం నిర్వహించడంపై పాకిస్తాన్‌ విమర్శలు కురిపించింది. భారత సుప్రీంకోర్టు వెల్లడించిన లోపభూయిష్ట తీర్పుతో మందిర నిర్మాణానికి మార్గం సుగమమైందని పాక్‌ వ్యాఖ్యానించింది. 

ఇది న్యాయం పట్ల విశ్వాసం సన్నగిల్లడమే కాకుండా భారత్‌లో ముస్లింలు, వారి ప్రార్ధనా స్ధలాలపై దాడులు పెరుగుతున్న తీరుకు అద్దం పడుతోందని పేర్కొంది. భారత్‌లో మైనారిటీలను అణిచివేసేలా మెజారిటీవాదం ప్రబలుతోందని పాకిస్తాన్‌ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.