జమ్ము‌క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా

జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్  జ‌మ్ముక‌శ్మీర్ గ‌వ‌ర్న‌ర్‌గా సిన్హాను నియామ‌కం చేస్తూ ఉత్త‌ర్వులిచ్చారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి గిరీష్ చంద్ర ముర్ము బుధవారం చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. 

 ఉత్తరప్రదేశ్‌కి చెందిన మనోజ్‌ సిన్హా ఐఐటీ వారణాసి నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన బెనారస్‌ హిందూ యూనివర్సిటీ యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

ఈ క్రమంలో బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజకవర్గం నంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. సమాచార శాఖ స్వతంత్ర మంత్రిగా, రైల్వేశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ అఫ్జల్‌ అన్సారీ చేతిలో ఆయన ఓటమి చెందారు.

కాగా, నూతన ‘కంట్రోలర్  అండ్‌ ఆడి‌టర్‌ జన‌రల్‌’ (కా‌గ్‌)గా ముర్ము బాధ్య‌తలు చేప‌ట్ట‌ను‌న్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కాగ్‌గా ఉన్న రాజీవ్‌ మహర్షి ఈ వారం పద‌వీ‌వి‌ర‌మణ చేయ‌ను‌న్నారు. 

2019లో  జమ్మూ కశ్మీర్ ను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించిన తర్వాత అక్టోబర్ 31, 2019లో ఆ రాష్ట్ర తొలి గవర్నర్ గా ముర్ము నియ‌మి‌తు‌ల‌య్యారు. ముర్ము గుజరాత్ కేడర్‌లోని 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన కార్యదర్శిగా ముర్ము ప‌నిచేశారు.