స్థానిక ఎన్నికల ప్రకియ మళ్ళి మొదటికేనా!

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతగా ప్రతిఘటించే ప్రయత్నం చేసినా సుప్రీం కోర్ట్ ఉత్తర్వులతో తిరిగి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో గత మార్చ్ లో జరిగిన ఎన్నికల పక్రియ ఏమిటనే ప్రశ్న అధికార పక్షాన్ని వేధిస్తున్నది. 
 
ఈ విషయమై ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సులు వివాదంలో చిక్కుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల పేరిట ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఆర్డినెన్స్‌ నంబరు 2 జారీ చేసింది. 
 
మొత్తం ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు కుదించడంతోపాటు ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే ఐదేళ్లలో సదరు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయవచ్చునంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 
 
అయితే ఈ ఆర్డినెన్సు ఇప్పటివరకు అసెంబ్లీ ఆమోదం పొందలేదు. దానితో దాని కాలపరిమితి జులై చివరి వారంతో తీరిపోయింది. దానితో ప్రభుత్వం హడావుడిగా కొత్త ఆర్డినెన్సు ను పాత ఆర్డినెన్సు కాలం చెల్లిన తేది నుండి అమలు అంటూ ఇప్పుడు తీసుకు వచ్చింది. ఈ ఆర్డినెన్సు చెల్లుబాటు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. .
 
ఆర్డినెన్స్‌ 2కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) రమేశ్‌ కుమార్‌ గత మార్చ్ లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లు మొదలు కావాల్సి ఉంది.
కానీ కరోనా కమ్ముకుని రావడంతో ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వాయిదా వేశారు.  స్థానిక ఎన్నికల ఆర్డినెన్స్‌ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దీనికి ఈనెల 20వ తేదీతో కాలం చెల్లుతుంది. 
 
కానీ, జూన్‌ 16న అసెంబ్లీ సమావేశమైంది. అప్పుడు ఆర్డినెన్స్‌ 2ను శాసనసభలో బిల్లుగా ఆమోదం పొందింది. కానీ, శాసన మండలిలో దీనిని అసలు ప్రవేశపెట్టనేలేదు. ఎంతసేపూ… ‘మూడు రాజధానుల బిల్లు’లపైనే దృష్టి పెట్టారు తప్ప, కీలకమైన పంచాయతీరాజ్‌ ఆర్డినెన్స్‌ని మండలిలో ఆమోదింప చేసుకొనే ప్రయత్నం చేయలేదు.
 
సభ ప్రారంభమైన తేదీ నుంచి 6వారాల్లోపు ఆర్డినెన్స్‌ ఆమోదం పొంది తీరాలి. ఆ గడువు గత నెల 27నే ముగిసిపోయింది. అధికారులు నింపాదిగా మంగళవారం ఆర్డినెన్స్‌ నంబరు 6ను జారీ చేశారు. ‘జూలై 27తో మురిగిపోయింది’ అని అంగీకరిస్తూనే  ఫిబ్రవరి 20న జారీ చేసిన ఆర్డినెన్స్‌ ఇంకా అమలులో ఉన్నట్లుగా పేర్కొంటూ తాజా ఆర్డినెన్స్‌ జారీ చేశారు.
 
ఇలా ఉండగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం! దానితో పాత ఆర్డినెన్స్‌ ఆధారంగా జారీ చేసిన ఎన్నికల ప్రక్రియ అసంపూర్ణంగా ఉన్నందున ఆ నోటిఫికేషన్‌ కూడా చెల్లక పోవచ్చని భావిస్తున్నారు. 
 
దానితో ఆ ఎన్నికల పక్రియను నిమ్మగడ్డ రద్దుచేసి, తాజాగా ఎన్నికల ప్రకటనను జారీచేస్తే సుమారు మూడొంతుల సీట్లను ఏకగ్రీవంగా గెల్చుకున్న అధికార పక్షంపై షాక్ ఇచ్చిన్నట్లు కాగలదు.