మహోజ్వలంగా అయోధ్య భూమి పూజ 

కోట్లాది మంది ప్రజలు దశాబ్దాలుగా నుంచి ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామజన్మభూమిలో  రామమందిరం భూమి పూజ మహోజ్వలంగా జరిగింది. రామజన్మభూమిలో మందిరాన్ని నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ  బుధవారం ఉదయం 12: 40 నిమిషాలకు అభిజిత్‌ లగ్నమంలో.. వెండి ఇటుకలతో శంకుస్థాపన చేశారు. 
 
వేద పండితులు మోదీ  చేత సంకల్ప మంత్రం చదివించారు. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, యుపి గవర్నర్ ఆనందీబెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లతో పాటు 17 మంది ప్రముఖులు ఈ  పూజలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తం ప్రచారం చేపట్టిన ‌ బీజేపీ సీనియర్‌‌ నేతలు ఎల్‌కే. అద్వానీ, మురళీ మనోహర్‌‌ జోషీలు వీడియో ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు. కరోనా పాజిటివ్‌ వచ్చి హాస్పిటల్‌లో ఉన్న హోం మంత్రి అమిత్‌ షా కూడా హాస్పిటల్‌ బెడ్‌పై నుంచే కార్యక్రమాన్ని వీక్షించారు. 
 
1989లో ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పంపిన ఇటుకల్లో జై శ్రీరామ్‌ అని రాసిన 100 ఇటుకలను పునాది రాయి కోసం ఉపయోగించినట్లు పూజారి ఒకరు చెప్పారు. సంప్రదాయ దస్తులైన కుర్తా, ధోటీతో ప్రధాని ప్రత్యేకంగా కనిపించారు. 
 
బుధవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని 11:30నిలకు అయోధ్యకు చేరుకోగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆయన స్వాగతం పలికారు. అక్కడ నుంచి హనుమాన్‌ గర్హీ ఆలయానికి చేరుకున్న మోడీ ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఆలయ నిర్మాణానికి హనుమంతుడి ఆజ్ఞను కోరేందుకు సంకేతంగా మొదట ఆంజనేయుడిని దర్శించుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు‌‌ అనిల్‌ మిశ్రా చెప్పారు. అక్కడ నుంచి నేరుగా రామమందిర నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న మోడీ రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు చేశారు. సాష్టంగా నమస్కారం చేశారు. 
 
ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటుచేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. అంతే కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 
 
గత మూడు రోజులుగా అయోధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామ నామస్మరణతో మోగి పోయిందని స్థానికులు చెప్పారు. మూడు రోజులుగా జరుగుతున్న ప్రత్యేక పూజలు శంకుస్థాపనతో ముగిశాయని పూజారి ఒకరు మీడియాకు చెప్పారు.