అయోధ్యలో రామమందిరంకు భూమిపూజ దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రామాలయ నిర్మాణంతో చరిత్ర రాయడమే కాదు, చరిత్ర పునరావృతం కానుందని ప్రకటించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ అనంతరం ‘జై శ్రీరామ్’ నినాదంతో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభింస్తూ జైశ్రీరామ్ నినాదం ఇవాళ అయోధ్యలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తోందని మోదీ తెలిపారు.
నేటి జయజయధ్వానాలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయని, దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయిందని ప్రధాని చెప్పారు. రాముడు అందరి మనసుల్లో నిండి ఉన్నాడు. ఎందరి త్యాగ ఫలితమో నేడు సాకారమైందని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం నిరీక్షణ వందల ఏళ్ల తర్వాత ఫలించిందని చెబుతూ నేటితో రామజన్మభూమికి విముక్తి కలిగిందని ప్రధాని ప్రకటించారు.
భారతీయ సంస్కృతికి నవీన చిహ్నం అయోధ్య రామాలయమని, మన భక్తి, మన జాతీయ మనోభావాలకు గుర్తు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల సమష్టి తీర్మానానికి ఉన్న శక్తికి కూడా రామాలయం ప్రతీక అని చెప్పారు. భవిష్యత్ తరాలకు సైతం ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘ప్రతి గుండె ఉప్పొంగుతోంది. ఇది యావద్దేశం భావోద్వేగంతో పులకిస్తున్న వేళ. సుదీర్ఘ నిరీక్షణ ఈరోజుతో ముగిసింది. రామ్ లల్లా కోసం భవ్య రామాలయం నిర్మాణం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా రామ్ లల్లా ఆలయం గుడారంలోనే కొనసాగింది’ అని మోదీ చెప్పారు.
ఇవి చారిత్రక క్షణాలని, కన్యాకుమారి నుంచి క్షీర్‌భవాని వరకు, కోటేశ్వర్ నుంచి కామాఖ్య వరకు, జగన్నాథ్ నుంచి కేథార్‌నాథ వరకూ, సోమ్‌నాథ్ నుంచి కాశీవిశ్వనాథ్ వరకూ అంతటా రామనామం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. పడవ నడిపే వ్యక్తి నుంచి గిరిజనుల వరకూ శ్రీరాముడికి ఏ విధంగా సాయపడ్డారో, కృష్ణ భగవానుడు గోవర్ధన గిరి ఎత్తడానికి పిల్లలు ఏ విధంగా సహకరించారో, మన అందరి సహాయ సహకారాలతో భవ్య రామాలయ నిర్మాణం పూర్తవుతుందని మోదీ భరోసా వ్యక్తం చేశారు.
రామాలయం నిర్మాణం తర్వాత అయోధ్య ఆర్థిక పరిస్థితి మారబోతుందని ప్రధాని మోదీ అభిలాష వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేందుకు అయోధ్యకు వస్తారని, తద్వారా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అప్పుడు ప్రతి రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా రామాయణ గాథలు భిన్న రూపాల్లో లభిస్తాయని చెబుతూ శ్రీరాముడు అంతటా వ్యాపించి ఉన్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రామనామం జపించే భక్తులు ఉన్నారని పేర్కొంటూ కంబోడియా, మలేషియా, థాయ్‌లాండ్‌లో రామాయణ గాథలు ప్రసిద్ధమని గుర్తు చేశారు.
శ్రీలంక, నేపాల్‌లో రాముడు, జానకిమాత కథలు వినిపిస్తాయని అంటూ సమాజం ఉత్సవ శోభితంగా నిండాలన్నదే శ్రీరామ సందేశమని ప్రధాని తెలిపారు. రాముడి ప్రేరణతో భారత్ ముందుకెళ్తుందని అంటూ శ్రీరాముడు కర్తవ్య పాలన నేర్పించారని, శ్రీరాముడు అందరికీ ప్రేరణగా నిలుస్తారని మోదీ వివరించారు.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
బంగ్లాదేశ్ లో కంగనా ‘ఎమర్జెన్సీ’ పై నిషేధం