దేశంలో సరికొత్త శకం  ప్రారంభం 

ఈ రోజు భారత దేశంలో ఓ కొత్త శకం ప్రారంభమైందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. భారత దేశం ’వసుధైక కుటుంబకం‘ అన్న వాక్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుందని, మన దేశ వాసులకున్న ఈ స్వభావమే ప్రతి సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనగలదని ఆయన తెలిపారు. 
 
రామ మందిర భూమిపూజ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన విశిష్ట అతిధిగా పాల్గొంటూ అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం మరో 20 నుంచి 30 ఏళ్ల పాటు పోరాటం చేయాలని, అప్పుడే అది ఫలిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సరసంఘ చాలకులు బాలాసాహేబ్ దేవరస్ అనేవారని గుర్తు చేశారు. దీని కోసం 30 సంవత్సరాల పోరాటం చేశామని చెబుతూ  అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం పోరాటం చేసిన మా సంకల్పానికి ఫలితం దక్కిందని హర్షం వ్యక్తం చేసారు .

ఈ మందిర నిర్మాణం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది పోరాటాలు చేశారని, ఆ జాబితాలో కొందరు కాలం చేసినా, మరికొందరు ఇప్పటికీ జీవించి ఉన్నారని తెలిపారు. అయోధ్య రథయాత్ర ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఎల్‌కే అద్వానీ ఇంట్లోనే కూర్చుండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని పేర్కొన్నారు. 

వీరితో పాటు ఇంకా అనేక మంది ఉన్నారని, అయితే వారందరూ భౌతికంగా హాజరయ్యే పరిస్థితి లేదని, కాలం అలాంటిదని ఆయన చెప్పారు. రామ మందిర నిర్మాణమే ఊపిరిగా చాలా మంది బతికి… శరీరం విడిచిపెట్టారని… వారందరూ సూక్ష్మ రూపంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని, మిగితా వారందరూ తమ మనస్సుతో చూస్తున్నారని ఆయన వివరించారు. 

దేశంలో స్వావలంబన దిశగా పనులు జరుగుతున్నాయని, కరోనా తర్వాత ప్రపంచం మొత్తం కూడా కొత్త మార్గాల కోసం వెతుకుతోందని భగవత్ చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అయ్యేందుకు ఇది ఆత్మవిశ్వాసం నింపుతుందని భరోసా వ్యక్తం చేశారు. భవ్య మందిర నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. చారిత్రిక ఘట్టంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని మోహన్‌ భగవత్‌ తెలిపారు. 

దేశంలో ఇప్పటికే ఉన్న లక్షలాది దేవాలయాల మాదిరిగానే ఈ అయోధ్య మందిర నిర్మాణం కాదని, ఈ దేవాలయాల ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తిరిగి మననం చేసుకుంటూ వాటిని సాధించే దిశగా అడుగులు వేయడమే ఈ మందిర నిర్మాణ లక్ష్యమని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. 

అత్యంత పవిత్రమైన ఈ ఘడియల కోసమే కొన్ని తరాలు, సాధులు, సంతులు పోరాటం చేశారని అంతకు ముందు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ గుర్తు చేశారు.  కొన్ని తరాలకు తరాలు ఈ అమృత ఘడియల కోసం వేచి చూస్తున్నాయని తెలిపారు.

 ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం ఘనంగా జరుగుతుందని, అదే సమయంలో అయోధ్య నగరాన్ని కూడా సాంస్కృతిక పరంగా, ఓ శక్తి శాలి నగరంగా తీర్చదిద్దడానికి తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన ప్రకటించారు. కరోనా ఉన్న కారణంగానే, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని కొద్ది మందికే ఆహ్వానాలు పంపినట్లు యోగి పునరుద్ఘాటించారు.