బరితెగించిన పాక్ మ్యాప్ పై మండిపడ్డ భారత్   

చైనా అండ చూసుకొని దాయాది దేశం పాకిస్తాన్‌ చెలరేగిపోతోంది. భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. భారత్‌లోని కొన్ని కీలక భూభాగాలు తమవేనని చెప్పుకుంటూ ఇటీవల నేపాల్‌ కొత్త మ్యాప్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి అక్కడ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.
 ఇదే తరహాలో పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)తోపాటు జమ్మూకశ్మీర్‌ను తమలో కలిపేసుకుంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ రూపొందించింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని ఇండియా ప్రభుత్వం నిర్వీర్యం చేసి బుధవారానికి ఏడాది కానుంది.  
 
భారత భూభాగాలు తమవేనని చెబుతూ కొత్త రాజకీయపటాన్ని (మ్యాప్‌ను) మంగళవారం విడుదల చేసిన పాకిస్థాన్‌ వైఖరిపై భారత్‌ మండిపడింది. కొత్త మ్యాప్‌ అంటూ పాకిస్తాన్‌ సాగిస్తున్న ప్రచారం అసంబద్ధమైన చర్య అని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. పాక్‌ ఎత్తుగడ హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పాక్‌ చర్యలకు చట్టబద్ధత గానీ, అంతర్జాతీయ సమాజం నుంచి ఆమోదం గానీ లేవని స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్‌, లఢక్‌లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని జునాగఢ్‌, మన్వదార్‌, సర్‌క్రీక్‌ తదితర భూభాగాలు తమవేనని పేర్కొంటూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆ దేశ కొత్త మ్యాప్‌ను విడుదల చేశారు.  ఈ మ్యాప్‌ పాకిస్థాన్‌ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతున్నదని, దీనికి కేబినెట్‌ ఆమోదం కూడా లభించిందని తెలిపారు.
దీనిని భారత విదేశాంగ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370 రద్దుకు బుధవారం నాటికి ఏడాది పూర్తవుతున్న వేళ పాకిస్థాన్‌ కొత్తమ్యాపును విడుదల చేసింది.