కార్పొరేట్ హాస్పిటళ్లపై ఈటల ఆగ్రహం   

కరోనా ట్రీట్మెంట్ను వ్యాపారంలా చూడొద్దని చెప్పి నా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లువినడం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ప్యాకేజీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. 
 
హాస్పిటల్ కు పోగానే రూ.2 లక్షలు అడ్వాన్స్ కట్టించుకోవడం, రోజుకు రూ.లక్షకు తగ్గకుండా ఛార్జ్ చేయడం, చనిపోతే మృతదేహాన్ని కూడా అప్పగించకపోవడం వంటి చర్యలపై వందల, వేల ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి నిస్సహాయత వ్యక్తం చేశారు. 
 
వాస్తవానికి, కరోనా చికిత్సకు వేయి రూపాయిల లోపే ఖర్చవుతుందని మంత్రి చెప్పారు. కరోనా రోగులకు ఇచ్చే మందులన్నీ ఐదు, పది రూపాయలకు దొరికేవేనని మంత్రి స్పష్టం చేశారు. ఆక్సిజన్ కు కూడా పెద్దగా ఖర్చు కాదని, వరసగా పది రోజులు ఆక్సిజన్ పెట్టినా రూ.2,500లోపు మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపారు.
పరిస్థితి విషమంగా ఉన్నవాళ్ళకు మాత్రమే కొంత ఖరీదైన మందులు అవసరం కాగలవని పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల తీరు చాలా హీనంగా, మానవత్వానికే కళంకంగా ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు సంపా దించడానికి, ప్రజలను బ్లాక్మెయిల్చేయడానికి సమయం కాదని హితవు పలికారు.
కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు.. చనిపోయే స్థితిలో ఉన్న రోగులను, డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్న రోగులను చివరి నిమిషంలో ప్రభుత్వ దవాఖాన్లకు పంపుతున్నాయని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో మాట్లాడినట్టు మంత్రి వెల్లడించారు. పద్ధతి మార్చుకోని హాస్పిటల్స్‌పై చర్యలు ప్రారంభించామని, విచారణ కొనసాగుతోందని చెప్పారు.
 కంగారు పడి ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లిడబ్బులు వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. కమ్యునిటీ హెల్త్సెంటర్లు, ఏరియా, జిల్లా హాస్పిటళ్లు, టీచింగ్ హాస్పిటల్స్‌అన్నింటిలోనూ కరోనా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
 
ఇలా ఉండగా, ఇప్పటికే చికిత్స పేరుతో ప్రజల నుంచి లక్షల్లో వసూలు చేసిన  సామాజిగూడాలోని  డెక్కన్ ఆస్పత్రి, బంజారా హిల్స్ లోని విరంచి ఆసుపత్రిలకు ఇచ్చిన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.