మానవ సంకల్పం గట్టిదైతే భగవంతుని సహకారం కూడా లభిస్తుందనడానికి మంచి ఉదాహరణ అయోధ్య రామజన్మభూమిలో శ్రీ రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం కావడం. 500 సంవత్సరాలుగా హిందువులు సాగించిన పోరాటం చివరికి ఫలించింది. ఈ పోరాటంలో వేలాదిమంది బలిదానం చేశారు. కోట్లాదిమంది మందిర నిర్మాణాన్ని కోరుకుంటూ తమకు తోచిన విధంగా వ్రతాలు, దీక్షలు ఆచరించారు. మందిర నిర్మాణ స్వప్నం సాకారమయ్యేవరకు ఉపవాస దీక్ష చేస్తామని నిశ్చయిం
చుకున్నవాళ్లు చాలమందే ఉన్నారు. తెలంగాణా రాష్ట్రంలోని భాగ్యనగరానికి చెందిన రాంరావ్ విఠల్ రావ్ షేరీకార్ కూడా అలాంటి దీక్షనే చేపట్టి, కొనసాగిస్తున్నారు.59 ఏళ్ల రాంరావ్ చాయ్ దుకాణం నడుపుతారు. బీదర్ కు చెందిన వీరి కుటుంబం 45 ఏళ్ల క్రితమే భాగ్యనగర్ వచ్చి స్థిరపడింది. వారికి అయోధ్య శ్రీరామచంద్రమూర్తి అన్నా, పూనా తుల్జాభవానీ మాత అన్నా ఎంతో భక్తి, గురి. తరచూ తుల్జాభవానీ దర్శనం చేసుకునే రాంరావ్ అందరిలాగానే తన కోరికలు తీర్చమని ఆ దేవిని కోరుకున్నారు.
కానీ ఆయన కోరుకున్నది తన వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరగాలనో, తనకు బాగా కలిసిరావాలనో కాదు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం పూర్తికావాలన్నది ఆయన మొదటి కోరిక. భాగ్యనగర్ లోని పురానాపూల్ ప్రాంతంలో (గౌలిగూడా) తాము తలపెట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట విజయవంతంకావాలన్నది రెండవ కోరిక. తుల్జాభవానీ మాతను కోరుకోవడమేకాక తన కోరికలు నెరవేరేవరకు పాదరక్షలు ధరించనని ప్రతిజ్ఞ చేశారు కూడా. అంతేకాదు తాను కోరుకున్నవి నెరవేర్చుకునేందుకు స్వయంగా ప్రయత్నించారు. తన అనుభవాలను ఆయన వివరించారు.
1990లో విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు అయోధ్యలో జరిగే కరసేవ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. వివాహమై అప్పటికి సంవత్సరం కూడా పూర్తికాలేదు. రామకార్యమై వెళుతున్న తనకు ఏదైనా కావచ్చని, తను తిరిగి రాకపోయినా చింతించవద్దని ఇంట్లో నచ్చచెప్పి బయలుదేరారు. అనేకమందితో కలిసి ఉత్సాహంగా వెళ్ళిన రాంరావ్ బృందాన్ని యు పిలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేశారు.
వారినుంచి చాకచక్యంగా తప్పించుకున్న వాళ్ళని రామభక్తే నడిపించింది. 20 రోజులపాటు కాలినడకన ప్రయాణం సాగించి చివరికి అయోధ్య చేరారు. దారి పొడవునా అనేక గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా వారికి ఆహారం, నీళ్ళు, ఇతర సదుపాయాలు కలిగించారు. ఎక్కడా ఎవరూ ఒక్క నయాపైసా కూడా అడగలేదు. `ఒక్క పక్షిని కూడా ఎగరనివ్వమంటూ’ అయోధ్యను అష్టదిగ్బంధనం చేసిన ములాయం ప్రభుత్వానికి కరసేవ రోజున హఠాత్తుగా వేలాదిమంది కరసేవకులు అయోధ్యలో ప్రత్యక్షమయ్యేసరికి దిక్కుతోచలేదు.
నిరాయుధులైన కరసేవకులపై నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా కాల్పులకు పాల్పడింది. లాల్ బంగాళా మొదలైన ప్రదేశాలు కరసేవకుల రక్తంతో తడిసిపోయాయని రాంరావ్ గుర్తుచేసుకున్నారు. అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడ్డ తాము ఢిల్లీకి వెళ్ళి అక్కడ నిరసన సభలో పాల్గొని తిరిగి భాగ్యనగర్ చేరుకున్నామని ఆయన వివరించారు. తమ బృందంలో కేవలం ఇద్దరం మాత్రమే చివరివరకు కలిసి ఉన్నామని, మిగిలినవారంతా చెల్లాచెదురయ్యారని చెప్పారు.
భాగ్యనగర్ కు వచ్చిన తరువాత రెండేళ్లలో తన రెండవ కోరికైనా శివాజీ విగ్రహ ప్రతిష్ట పూర్తైందని, ఆ సంతోషంలో తుల్జాభవాని మాత దర్శనానికి వెళ్ళి వచ్చి అయోధ్య రామమందిర విషయాన్ని మరచి పాదరక్షలు ధరించడం ప్రారంభించారు. అలా చేసిన కొద్ది కాలానికే రాంరావ్ చేతులు, కాళ్ళు పగుళ్లు పడి విపరీతమైన నెప్పులు ప్రారంభమయ్యాయి. ఎంతమంది డాక్టర్లను సంప్రదించిన లాభం లేకపోయింది.
చివరికి ఒక రాత్రి స్వయంగా తుల్జాభవానీ మాత కలలో కనిపించింది. రామమందిరాన్ని గురించి ఎందుకు మరచిపోయావని ప్రశ్నించింది. దీక్ష కొనసాగించమని ఆదేశించింది. ఆ మాత చెప్పిన ప్రకారమే వెంటనే తాను తిరిగి పాదరక్షలు ధరించడం మానేశానని, ఆ తరువాత కొద్దికాలానికే కాళ్ళు, చేతుల పగుళ్లు, నెప్పులు పూర్తిగా పోయాయని రాంరావ్ చెప్పారు. ఇప్పుడు ఆగస్ట్ 5న రామమందిర భూమిపూజ జరుగుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
More Stories
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు