అయోధ్యపురిలో నేడే అద్భుత ఘట్టం

రఘురాముడి జన్మస్థలమైన అయోధ్యలో కోట్లాది మంది హిందువుల చిరకాల ఆకాంక్ష సాకారానికి కొద్ది గంటల్లో తొలి అడుగు పడనుంది. భవ్యమైన రామాలయం నిర్మాణానికి ఇవాళ మధ్యాహ్నం శంకుస్థాపన జరుగనుంది. ఈ అపూర్వమైన ఘట్టానికి దేశ ప్రధాని నరేంద్రమోడి హాజరై అంకురార్పణ చేయనున్నారు. అధ్యాత్మిక నగరి అయోధ్య అతిపెద్ద పండుగకు ముస్తాబైంది.  

ఈ  భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ,  ఆర్‌ఎస్‌ఎస్ అధినేత  మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సహా 175 మంది ప్రముఖులను ఆహ్వానించినట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రకటించింది.

ఆహూతుల్లో 135 మంది దాకా స్వామీజీలు, సాధువులు ఉన్నారు. అయోధ్యకు చెందిన కొందరు ప్రముఖ వ్యక్తులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్మానించారు. భూమిపూజకు సంబంధించిన ప్రత్యేక పూజాకార్యక్రమాలు సోమవారమే ప్రారంభమైనప్పటి భూమిపూజ శుభముహూర్తం మాత్రం బుధవారం మధ్యాహ్నం12:44:08నుంచి12:44:4౦గంటల వరకు మాత్రమే ఉందని కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పూజారులు, మతపెద్దలు పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ  అయోధ్యలో మూడు గంటల పాటు పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అయోధ్యకు చేరుకున్న వెంటనే ఆయన హనుమాన్ గడి ఆలయాన్ని సందర్శిస్తారు. మొదట అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. అనంతరం అక్కడ ఒక పారిజాత మొక్కను నాటుతారు. 

దాదాపు 20 నిమిషాల పాటు జరిగే భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమమంతా మధ్యాహ్నం 2 గంటలదాకా సాగవచ్చని సమాచారం. అనంతరం ప్రధాని ఢిల్లీ తిరిగి వెళ్తారు.

ఇదిలా ఉండగా ప్రధాని రాకసందర్భంగా హనుమాన్ గడి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయోధ్యలో శ్రీరాముడిని దర్శించడానికి ముందు హనుమాన్‌గడి ఆలయాన్ని సందర్శించడం సంప్రదాయం. ఈ సంప్రదాయానికి అనుగుణంగా ప్రధాని కూడా అయోధ్యకు చేరుకున్న వెంటనే ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. 

అయితే కరోనా వైరస్ ఆంక్షల కారణంగా ప్రధానికి నేరుగా కలుసుకోలేక పోవడంపై ఆలయ పూజారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. `ప్రధానికి ఒక గద, కిరీటం, వెండి ఇటుక, శాలువాను కానుకగా ఇవ్వడానికి బోలెడు ఏర్పాట్లు చేశాం. అయితే కొవిడ్‌ప్రొటోకాల్ కారణంగా ఇది సాధ్యం కావడం లేదు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాం’ అని హనుమాన్ గడి మహంత్ రాజుదాస్ చెప్పారు.

ఈ నేపథ్యంలో రామాలయానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మంగళవారం ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. మూడు అంతస్థుల రాతికట్టడంలో గోపురాలు, కట్టడాలతో 161 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముందుగా అనుకున్న నమూనాకంటే ఆలయం ఎత్తును 20 అడుగులు పెంచినట్లు శిల్పులు తెలిపారు. 

ఆలయంలో ఒకేసారి లక్షమంది భక్తులు సమావేశం కావచ్చని అంచనా. రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఆలయం ఉత్త్రర  భారత దేశంలోని నాగర శైలిలో ఉండనుంది. నమూనా ఆకృతుల ప్రకారం ఐదు గుమ్మటాలు ఉంటాయి. అలాగే గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉంటుంది.

గర్భగుడిపైన ఒక శిఖరాన్ని నిర్మిస్తారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు మూడేళ్ల సమయం పడుతుందని శిల్పులు తెలిపారు. ప్రముఖ ఆలయాల శిల్పి చంద్రకాంత్ సోమ్‌పుర ఆలయాన్ని డిజైన్ చేశారు. రామమందిర నమూనాల కోసం 30 ఏళ్ల క్రితమే తనను సంప్రతించినట్లు ఆయన చెప్పారు. 

అయితే అప్పట్లో ర్పూందించిన ఆకృతికి ప్రస్తుత శైలికి దగ్గరగా కొన్ని మార్పులు చేసినట్లు ఆయన చెప్పారు. దేశంలో సోమ్‌నాథ్, అక్షరధామ్‌లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులను వీరి కుటుంబమే డిజైన్ చేసింది. చంద్రకాంత్ తండ్రి ప్రభాశంకర్ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ డిజైన్‌ను రూపొందించి పనులను సైతం పర్యవేక్షించారు.