బీరూట్  భారీ పేలుళ్ల‌లో 78 మంది మృతి

బీరూట్  భారీ పేలుళ్ల‌లో 78 మంది మృతి

లెబనాన్‌ రాజధాని బీరూట్‌లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్లు సంభ‌వించాయి. ఇందులో 78 మంది మర‌ణించార‌ని, 3700 మంది గాయ‌ప‌డ్డార‌ని లెబ‌నాన్ ప్ర‌ధాని హ‌స‌న్ దియాబ్ ప్ర‌క‌టించారు.

దేశంపై అణుబాంబు దాడి జరిగిందా? అనిపించేలా బ్రహ్మాండమైన పేలుళ్లు సంభవించాయి. తేరుకొని చూసేలోపు పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టమై, రక్తపు మడుగుల్లో మృతదేహాలు, కాపాడమంటూ వందలమంది ఆర్తనాదాలు తలెత్తాయి.

ఘటనాస్థలికి మైళ్ల దూరంలో ఉన్న ఇండ్ల కిటికి అద్దాలు, పైకప్పులు కూడా కూలిపోయాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. పేలుళ్ల ఘటనలో అనేక దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

పోర్టులో సుమారు 2750 ట‌న్నుల అమ్మోనియం నైట్రేట్ ఒక్క‌సారిగా పేల‌డంతోనే ఈ భారీ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని ప్రధాని చెప్పారు. ఎలాంటి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోకుండా ఓడ‌రేవులో ఆరేండ్లుగా నిల్వ‌చేస్తున్నార‌ని, దీన్ని ఎరువులు, బాంబుల త‌యారీకి వినియోగిస్తున్నార‌ని వెల్ల‌డించారు.

ఈ భారీ పేలుళ్ల‌తో రాజ‌ధాని బీర‌ట్‌లో చాలా ప్రాంతాల్లో ఇండ్ల కిటికి అద్దాలు, పైకప్పులు కూలిపోయాయి. అనేక దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుళ్లధాటికి భయపడిన జనం ఇండ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.
 
 ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల భూమి కంపించింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు. అదేవిధంగా పేళుడు శ‌బ్ధాలు ఘ‌టనా స్థ‌లానికి 240 కి.మీ. దూరంలో ఉన్న సైప్రస్‌లోని నికోసియా దీవికి కూడా వినిపించాయాని తెలిపారు.   
 1975-1990 మ‌ధ్య‌కాలంలో దేశంలో జ‌రిగిన అంత‌ర్యుద్ధంలో కూడా ఇంత భారీ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని, పేలుళ్లు జ‌రిగిన ప్రాంతానికి చుట్టూ ఉన్న భ‌వ‌నాల‌న్నీ కూలిపోయాయ‌ని ఓ సైనికుడు వెళ్ల‌డించారు.