మూడు రాజధానులపై హైకోర్టు స్టే

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. మూడు రాజధానులపై విడుదల చేసిన గెజిట్ ను నిలిపి వేయాలని దాఖలైన పిటిషన్ ను  విచారించిన హైకోర్టు గెజిట్ పై స్టే ఇచ్చింది.
 
 అంతేకాదు రాజధాని తరలింపుతో పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై స్టే విధించింది. 10 రోజుల పాటు ఎప్పటి లానే పరిస్థితులు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. 14వ తేదీ వరకు స్టే కొనసాగుతుందని పిటిషన్ ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.
 
 కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజుల సమయం కావాలని కోర్టును ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు.  బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.  పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. 
 
ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 
 
ఇలా ఉండగా, హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు న్యాయమూర్తులకు దండం పెడుతూ వారు వెళ్లే మార్గంలో మానవహారంగా నిలుచున్నారు. వెంటకపాలెం, మందాడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయపాలెం గ్రామస్తులు రోడ్డుపై నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు.