రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలంటేనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భయం, భయంగా కనిపిస్తున్నారు. చివరకు ఎన్నికల కమీషన్ కార్యాలయంలోని సిబ్బంది సహితం ఎక్కడ ప్రభుత్వ అధినేతలకు కోపం వస్తుందో అని జంకుతున్నారు.
శుక్రవారమే హైదరాబాద్ లో ప్రభుత్వ ఉత్తరువు మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన విజయవాడలోని కమీషన్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ సంకేతాలు వ్యక్తం అయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలతో తిరిగి నియమించబడిన ఆయన పట్ల ప్రభుత్వ పెద్దలు అధికార వర్గాలలో ఆందోళన కనిపిస్తున్నది.
ఆయనకు సహకరించినా, ఆయనతో సఖ్యతగా ఉన్నా ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమోనన్న ఆందోళన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో కనిపించింది. విజయవాడలో తన కార్యాలయంలోనే ఆయనకు ఆదరణ కరువైంది.
సోమవారం విజయవాడలోని కార్యాలయానికి వచ్చిన నిమ్మగడ్డ విషయంలో ప్రొటోకాల్ పాటించలేదు. సంబంధిత పోలీస్ అధికారి సెల్యూట్ చేసి లోపలికి తీసుకెళ్లడం వంటి గౌరవ కార్యక్రమం కూడా జరగలేదు. ప్రొటోకాల్ ప్రకారం ముందుగానే ఏర్పాట్లు చూడాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ ఆయన వచ్చే సమయానికి ఆఫీసుకు రాలేదు.
ఆ తర్వాత వచ్చి నిమ్మగడ్డను కలిసి సంజాయిషీ చెప్పుకున్నట్లు తెలుస్తున్నది. తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత రమేశ్‌కుమార్ కార్యాలయానికి వస్తున్నారంటూ విలేకరులు భారీ సంఖ్యలో వచ్చినప్పటికీ కార్యాలయ సిబ్బంది మాత్రం కనిపించలేదు. ఒకరిద్దరు సిబ్బంది మాత్రం ఒక పూల బొకే పట్టుకుని మొక్కుబడిగా ఆయనకు ఆహ్వానం పలికారు.
More Stories
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తాం
ఒకేరోజు 13,326 గ్రామసభలతో ఏపీ ప్రపంచ రికార్డు
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు