పోలీస్ స్టేషన్‌లో బీజేపి నేతల రాఖీ పండుగ 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఏపీ బీజేపీ నేతలు అభినందించారు.  విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో బీజేపి నేతలు సోము వీర్రాజు, సునీల్ ధియోధర్, జీవీఎల్ నర్సిహారావు రాఖీ పండుగ జరుపుకున్నారు. 
 
మహిళా పోలీసులతో రక్షా బంధన్ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వారియర్స్‌గా పని చేస్తున్న పోలీస్, వైద్యులు, మీడియా మహిళా సిబ్బంది సేవలను కొనియాడారు. సుమారు 80 మంది పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు కరోనా ప్రభావం, లాక్ డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ వారు విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.
 
విధి నిర్వహణలో ప్రజలకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించటమే కాకుండా కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించటం, అలాగే హోం ఐసోలేషన్ ఉండమని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటివన్నీ పోలీస్ శాఖకు సంబంధంలేకపోయినా కూడా సమాజానికి ఉపయోగపడే పనులు, విధులను నిర్వహిస్తున్నారు.’ అని గుర్తు చేశారు. 
 
రాఖీ పండుగ రోజు సందర్భంగా విజయవాడ వచ్చి పోలీస్ సిబ్బందిని అభినందించారు. పరిశుభ్రత విషయంలో కార్పొరేషన్ సిబ్బంది సేవలను గుర్తించి వారిని సన్మానించారు. వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు కరోనాతో ఇబ్బంది పడుతున్న పేషెంట్లకు సేవలు నిర్వహిస్తూ వైద్య వృత్తికే మరింత గుర్తింపు తెస్తున్నట్లు బిజెపి నేతలు అభినందించారు. 
 
మీడియా కూడా కరోనా వంటి కష్టకాలంలోనూ ప్రజలు కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేయటం, కరోనా నిబంధనలు ప్రజలకు వివరిస్తున్నారని కొనియాడారు.