
ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ కరోనా ముప్పు పోలీసులు, వైద్య సిబ్బందితో పాటూ ప్రజా ప్రతినిధుల్ని వెంటాడుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైరస్ బారినపడ్డారు. తాజాగా మరో మంత్రికి పాజిటివ్ అని తేలింది.
ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండటంతో ఆయన హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకున్నారు. తొలుత నెగెటివ్ రాగా మరోసారి మంగళవారం సాయంత్రం చేయించుకున్నా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఆయన వెంటనే చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరారు.
ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పాజిటివ్ రావడంతో ఇప్పటికే హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చేరారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన భార్యకు కూడా వైరస్ ఉన్నట్లు తేలడంతో ఒంగోలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏపీలో మంగళవారం అంతకు ముందు 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 67 మంది మృతి చెందారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 12 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,604కి పెరిగింది.
కొత్తగా మంగళవారం 9,747 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,76,333కి చేరింది. తాజాగా 6,953 మంది డిశ్చార్జి అయ్యారు. 79,104 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 95,625 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఎపిలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసిపి ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా బారినపడి కోలుకున్నారు.
విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరోనా బారినపడిన విషయం తెలిసిందే.
More Stories
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు
అమరావతిలో రూ 1 లక్ష కోట్ల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం