‌ యడ్యూరప్పకు, కుమార్తెకు కరోనా పాజిటివ్   

‌ యడ్యూరప్పకు, కుమార్తెకు కరోనా పాజిటివ్   

కర్ణాటకలో నిత్యం వేలల్లో జనం కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు వైరస్‌ బారిన పడగా తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పకు పాజిటివ్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. 

ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన వారందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. చికిత్స కోసం ఆయన బెంగళూరులోని ఓల్డ్‌ ఎయిర్‌పోర్టు రోడ్‌లోని మణిపాల్‌ దవాఖానలో గత రాత్రి చేరారు.

సీఎం కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఆయ‌న కూతురుకు కూడా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆమె ద‌వాఖాన‌లో చేరిన‌ట్లు మ‌ణిపాల్ హాస్పిట‌ల్ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. గ‌త నెల మొద‌టివారంలో సీఎం అధికార నివాసంలోని ఆఫీస్‌లో ప‌నిచేస్తున్న వ్య‌క్తికి కూడా క‌రోనా సోకింది.

‘కరోనా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించారు. వైద్యుల సిఫారసు మేరకు ముందు జాగ్రత్తగా నేను దవాఖానలో చేరాను. ఇటీవల నన్ను సంప్రదించిన వారంతా గమనించి, స్వీయ నిర్బంధంలో ఉండాలని అభ్యర్థిస్తున్నాను’ అని యడ్యూరప్ప ట్వీట్‌ చేశారు. 

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తర్వాత దేశంలో వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన రెండో సీఎం యడ్యూరప్ప. నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లక్షణాలతో దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. ఆ వెంటనే శ‌నివారం అమిత్‌షాను క‌లిసిన కేంద్ర  మంత్రి బాబూల్ సుప్రియో తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ పురోహిత్ కూడా క‌రోనాబారిన‌ప‌డ్డారు. ఆదివారం ఆయ‌న చెన్నైలోని కావేరీ ద‌వాఖాన‌లో ప‌రీక్ష‌లు చేయింకున్నారు. అందులో ఆయ‌న‌కు పాజిటివ్ వ‌చ్చింది. దీంతో త‌న నివాసంలోనే ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

శనివారం కర్ణాటకలో వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్‌తో పాటు ఆయన భార్య వైరస్‌ బారినపడ్డారు. అంతకు ముందు అటవీశాఖ, పర్యాటక శాఖ మంత్రులు ఆనంద్‌ సింగ్‌, సీటీ రవి కొవిడ్‌-19 సోకింది. 

కాగా, ఆదివారం కర్ణాటకలో కొత్తగా 5,532 కరోనా కేసులు నిర్ధారణ కాగా, 84 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1.34 లక్షల కేసులు పాజిటివ్‌గా ధ్రువీకరణ కాగా, మృతుల సంఖ్య 2,496కు చేరింది.

ఇలా ఉండగా, ఉత్తర ప్రదేశ్ మంత్రి కమలా రాణి వరుణ్ (62) కరోనా బారిన పడి చనిపోగా, యుపి బిజెపి అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది.