అయోధ్యలో రామాలయం నిర్మాణంతో సహోదరత్వం, సామరస్యం వెల్లివిరుస్తుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు కామేశ్వర్ చౌపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాల రామాలయ నిర్మాణ ఉద్యమంలో రాజకీయ రంగు అంటుకుని ఉండవచ్చునని, సామాజికంగా కొంత అసమ్మతి వ్యక్తంచేసి ఉండవచ్చునని చెప్పా రు. అయితే ఈ నెల 5వ తేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఆరంభంతో ఈ అపశృతులు అన్నీ తొలిగిపోతాయని యోరసా వ్యక్తం చేశారు.
సమాజంలో ఈ ఘట్టంతో సహోదరత్వం, అంతకుమించిన సామరస్యం నెలకొంటుందని ఆయన స్పందించారు. శ్రీరాముడు అంటేనే విలువలకు ప్రతీక అని, రాముడికి ప్రతీకాత్మక రీతిలో మందిర నిర్మాణ ఘట్టంతో దేశంలో రామరాజ్య నిర్మాణానికి శంకుస్థాపన పడినట్లు అవుతుందని తెలిపారు.
రాముడు తన జీవితంలో ఆచరించిన విలువలు మహోన్నతం అని, సామాజిక సామరస్యం, అందరి సమానత్వం, సహోదరత్వపు విలువలను ఆయన ఆచరించి చూపారని చౌపాల్ అభిప్రాయపడ్డారు. విలువల కోసం పాటుపడిన మహనీయుడికి నిలయం వెలియడం నిజంగానే ఆ విలువలు సమాజంలో వెళ్లూనుకునేందుకు దోహదపడుతాయని చెప్పారు.
ట్రస్టులో దళిత సభ్యుడిగా ఉన్న చౌపాల్ రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఆలయ ఉద్యమంతో బిజెపి నిజంగానే లబ్ధి పొందిందని, ఉద్యమ సమయంలో ఇతరత్రా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని, అయితే ఇవన్నీ కూడా ఆలయ నిర్మాణ ఘట్టంతో సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉద్యమంతో అవినాభావ సంబంధం పెట్టుకున్న బిజెపి ఇందుకోసం చివరికి నాలుగు ప్రభుత్వాలను తృణప్రాయంగా త్యజించిందని గుర్తు చేశారు. ఆలయ నిర్మాణ లక్షం ప్రధాన ధ్యేయంగా ఎంచుకుని ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని కూడా దూరం చేసుకుందని తెలిపారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాలను బర్తరఫ్ చేసిందని పేర్కొన్నారు.
1992లో హిందూత్వ సంస్థల పిలుపు మేరకు జరిగిన కరసేవ దశలో బాబ్రీ మసీదు కూల్చివేత పరిణామాల నడుమ బిజెపి ప్రభుత్వాలపై కాంగ్రెస్ వేటు వేసిందని తెలిపారు. అయోధ్య ఉద్యమం అన్ని పార్టీలకూ అతీతంగా సాగిందని, తాము ఏ పార్టీని కాదనలేదని స్పష్టం చేశారు.
రామాలయ నిర్మాణం కోసం సాగిన ఉద్యమం గంగా పరవళ్లు వంటిదని, కొందరు ఈ పవిత్ర జలాలను అందుకున్నారని, కొందరు ఈ నది తమ ముందు నుంచి ఉరకలు పరుగులతో సాగినా అందుకోలేదని పరోక్షంగా కాంగ్రెస్ ఇతర పార్టీల వైఖరిపై మండిపడ్డారు.
చౌసాలఖ విశ్వహిందూ పరిషత్‌తో అనుబంధం ఉండగా, తరువాత బిజెపి ఎంపి అయ్యారు. 1989లో శిలాన్యాస్ ప్రక్రియ ద్వారా రామాలయ నిర్మాణ సంకల్పాన్ని చాటిచెప్పాలనే విస్తృత కార్యక్రమానికి ఆద్యుడిగా మారారు. ఉద్యమంతో సమాజం అంతా కలిసి రావాలనే పిలుపు నిచ్చారు. ఆలయ నిర్మాణ కార్యక్రమానికి వస్తున్న ప్రధాని మోదీని చౌపాల్ కొనియాడారు.
అయోధ్య వ్యాజ్యం పరిష్కారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు కావాలనే ఆలస్యం చేశాయని,మోదీ అధికారంలోకి వచ్చిన తరువాతనే కక్షిదారుల నుంచి సరైన స్పందన వెలువడటం, న్యాయ ప్రక్రియ వేగవంతం కావడం జరిగిందని చౌపాల్ తెలిపారు.
More Stories
చైనా జాతీయుడికి `సుప్రీం’ బెయిల్ నిరాకరణ
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్
బుల్డోజర్ న్యాయం ఆపేయమన్న సుప్రీంకోర్టు