యుఎఇ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యుఎఇలో ఈ టోర్నీ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
మరోవైపు గతంతో పోల్చితే భిన్నంగా ఈసారి ఐపిఎల్ ఫైనల్‌ను ఆదివారం కాకుండా మరో రోజు నిర్వహించనున్నారు. బిసిసిఐ వర్గాల సమాచారం ప్రకారం ఈ సారి ఐపీఎల్ ఫైనల్ మంగళవారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా వికెండ్‌లో కాకుండా ఐపిఎల్ వంటి మెగా ఫైనల్‌ను ఇతర రోజుల్లో నిర్వహించడం ఇదే తొలిసారి అవుతుంది.
ఇదిలావుండగా ఈసారి ఐపిఎల్ మొత్తం 53 రోజుల పాటు కొనసాగనుంది. మరోవైపు ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణ ఏర్పాట్ల గురించి చర్చించేందుకు ఆదివారం పాలక మండలి సమావేశమైంది.
ఈ భేటిలో ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాతో పాటు ఆయా ఫ్రాంచైజీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక, ఐపిఎల్ షెడ్యూల్‌ను వారం రోజుల్లో ఖరారు చేస్తారు.
మరోవైపు ఈసారి గల్ఫ్ వేదికగా మహిళల ఐపిఎల్‌ను కూడా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వయంగా ప్రకటించాడు. మహిళా జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి టోర్నీని నిర్వహిస్తారు.
ఈ టోర్నీ షెడ్యూల్‌తో పాటు ఇతర వివరాలను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. టోర్నీ నిర్వహణకు అన్ని అడ్డంకులు తొలగి పోవడంతో ఏర్పాట్లను ముమ్మరం చేస్తామని గంగూలీ తెలిపాడు.
More Stories
జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం
వైద్యులందరికీ ప్రత్యేక ఐడీలు
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు