ప్రధాన మంత్రికి మాత్రమే ఎస్పీజీ భద్రత   

దేశంలో ప్రముఖుల భద్రత కోసం ఉద్దేశించిన ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ‌)లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి దాకా పలువురు ప్రముఖ వ్యక్తులకు భద్రత కల్పించిన ఈ విభాగం ప్రధాన మంత్రికి మాత్రమే భద్రత కల్పించేలా కేంద్రం కీలక మార్పులు చేపట్టింది. 

ప్రధానికి సహితం  ప్రస్తుతం ఉన్న వారిలో 50-60శాతం మంది సిబ్బందితోనే ప్రధానికి భద్రత కల్పించనున్నారు.  దానితో తాజాగా సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా డెప్యుటేషన్‌ పూర్తయిన సుమారు 200 మంది సిబ్బందిని మాతృ విభాగాలకు పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

రానున్న రోజుల్లో.. ఎస్పీజీలో ఉన్న 4వేల మంది సిబ్బందిని దశల వారీగా తగ్గించే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను కూడా ఉపసంహరించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పారు

కమాండో శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని  విడతల వారీగా 50 నుంచి 60 శాతం మేర వెనక్కి పంపించి, అంతర్గత రక్షణ విధుల్లో వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ భద్రతకు కేటాయించిన సిబ్బంది మాత్రమే ఎస్‌పీజీలో ఉంటారని పేర్కొన్నారు. 

ఎస్‌పీజీ ఏర్పాటయ్యాక ఇలా కుదింపు చేపట్టడం ఇదే ప్రథమం. 1985లో ఏర్పాటైన ఎస్‌పీజీ కోసం వివిధ పారామిలటరీ, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి సిబ్బందిని ఎంపిక చేసుకున్నారు.