జాబిల్లిపై భద్రంగా చంద్రయాన్‌2 రోవర్‌

చంద్రుడిపై చంద్రయాన్‌2లో భాగంగా ప్రయోగించిన ప్రగ్నాన్‌ రోవర్‌ భద్రంగా ఉందని, అది పనిచేస్తోందని, అందరు అనుకొంటున్నట్లుగా అది ధ్వంసం కాలేదని, దాన్ని తాను గుర్తించానని చెన్నైకి చెందిన యువ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్‌ తెలిపారు. గతంలో చంద్రయాన్‌2 లాండర్‌ అవశేషాలను కూడా ఇతనే గుర్తించాడు. దాన్ని నాసా కూడా అంగీకరించింది.
 
రోవర్‌ గుర్తింపుకు సంబంధించి నాసా విడుదల చేసిన ఫోటోను కూడా ఈ 33 ఏళ్ల యువ శాస్త్రవేత్త ట్వీట్‌ చేశారు. చంద్రుడిపై దిగడంలో సమస్య వచ్చి చెడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌ నుండి ప్రగ్నాన్‌ రోవర్‌ విడిపడి కొంత దూరం ప్రయాణించినట్లు కూడా ఈ యువ శాస్త్రవేత్త చెప్పారు. 
 
ప్రస్తుతం అది చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా ఉంది. గతంలో మూన్‌ల్యాండర్‌ ‘విక్రమ్‌’ శకలాలను కూడా సుబ్రమణియన్‌ గుర్తించారు. ఆ విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. తాజాగా, ప్రజ్ఞాన్‌ క్షేమంగా ఉందని పేర్కొంటూ, పలు ఫొటో ఆధారాలతో సుబ్రమణియన్‌ పలు ట్వీట్లు చేశారు. 
 
‘చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిన తరువాత కూడా ల్యాండర్‌కు భూమి నుంచి సందేశాలు అంది ఉండవచ్చు. అయితే, అది మళ్లీ తిరిగి సమాధానం ఇవ్వలేకపోయి ఉండవచ్చు’ అని సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. 
 
నాసా విడుదల చేసిన ఒక ఫొటోను వివరిస్తూ.. ల్యాండర్, రోవర్‌ ఉన్న ప్రదేశాలను ఆయన అంచనా వేశారు. అయితే రోవర్‌ ఇంకా పనిచేస్తూ ఉందని కచ్చితంగా చెప్పలేనని స్పష్టం చేశారు.   సుబ్రమణియన్‌ అందజేసిన సమాచారానికి సంబంధించిన ఆధారాలను పరీక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ తెలిపారు.  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత ఏడాది సెప్టెంబర్‌ 6న చంద్రుడిపై దిగిన విక్రమ్‌ లాండర్‌ నుంచి అనుసంధాన్ని కోల్పయింది.