ప్రభావం కోల్పోతున్న రాహుల్ మద్దతుదారులు 

కాంగ్రెస్ లో ప్రతుతం పాత – కొత్త తరాల మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు మీడియా కధనాలు వెలువడుతున్నాయి. కానీ వాస్తవానికి నేడు అంతర్గతంగా జరుగుతున్న చర్చ గాంధీ కుటుంభం తప్పుకొంటే గాని పార్టీకి భవిష్యత్ లేదని. పార్టీ నేతృత్వం వహిస్తున్న సోనియా గాంధీ ఆరోగ్యరీత్యా అసలు పనిచేయలేని పరిస్థితులలో ఉన్నారు.
 
తిరిగి రాహుల్ గాంధీ నాయకత్వం చేపట్టాలని కొందరు మద్దతు దారులు కోరుతున్నా పార్టీలో ఎవ్వరు పట్టించుకొవడం లేదు. 
ఈ మధ్య పార్టీలో మధ్య వయస్కులు (50 సంవత్సరాలు, ఆ పై వారు) కొందరు ఒక ప్రముఖ న్యాయవాది నేతృత్వంలో సమావేశమై గాంధీ కుటుంభం గురించి చర్చించినట్లు తెలిసి ఆ కుటుంభంలో కలవరం చెలరేగింది. 
 
అందుకనే వెంటనే సోనియా గాంధీ పార్టీ రాజ్యసభ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తర్వాత కొందరు ముఖ్య నాయకులతో భేటీ జరిపారు. పదవుల కోసం జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ లు జరిపిన తిరుగుబాటు కారణంగా 2004 తర్వాత రాహుల్ బ్రిగేడ్ గా పార్టీలో ఒక వెలుగు వెలిగిన యువనేతలు ఇప్పుడు ప్రాబల్యం కోల్పోతున్నారు. 
 
మిలింద్ దేవర, జితిన్ ప్రసాద, సందీప్ దీక్షిత్, ఆర్ పి ఎం సింగ్ వంటి వారు ఇప్పుడు రాజకీయ ఉనికి కోల్పోతున్నారు. వారే కాదు గత ఐదేళ్లుగా పార్టీలో కీలక పదవులు రాహుల్ అప్పచెప్పిన కేసి వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా, కౌశల్ విద్యార్థీ, అలంకార సవై, సచిన్ రావు, రాజీవ్ సత్య, కనిష్క సంఘ్ వంటి వారు సహితం ఎటువంటి ప్రభావం చూపలేక పోతున్నారు. 
 
గత వారం సోనియా రాజ్యసభ సభ్యులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో రాహుల్ గాంధీకి పార్టీ నాయకత్వం అప్పచెప్పాలని రాజీవ్ సతాయి సూచించినా పెద్దగా స్పందన కనిపించలేదు. ఈ సందర్భంగా రాహుల్ పార్టీ నాయకత్వం చేపట్టాలని అంటూనే సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సూచనలు రాహుల్ శిబిరంలో కలకలం రేపుతున్నాయి. 

రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో మరింత క్రియాశీలకంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని దిగ్విజయ్‌ సింగ్‌ సూచించారు. రాజకీయాలను భిన్నంగా నడపాలనే రాహుల్‌ అవగాహనను తాను అర్ధం చేసుకోగలనని, శరద్‌ పవార్‌ సూచించిన విధంగా ఆయన దేశమంతా చుట్టిరావాలని, ప్రజలతో మమేకమయ్యేందుకు యాత్రలు కీలకమని డిగ్గీరాజా ట్వీట్‌ చేశారు. పరోక్షంగా రాహుల్ నాయకత్వ లక్షణాలను ఆయన ప్రశ్నించినట్లు ఉన్నదని పలువురు భావిస్తున్నారు. 

రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్లు, వీడియోలతో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ వర్గాల నుండే స్పందన కనిపించడం లేదు.