అమిత్ షా, తమిళనాడు గవర్నర్ లకు కరోనా 

ఈ ఆదివారం బీజేపీనేతలకు కరోనా మహమ్మారి కారణంగా ఉత్తర ప్రదేశ్ లో ఒక మంత్రి ప్రాణాలు కోల్పోగా, కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన హోమ్ మంత్రి అమిత్ షా వైరస్ పాజిటివ్ గా తేలడంతో ఆసుపత్రిలో చేరారు. 
మరోవంక తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కూడా కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. కరోనా కారణంగా ఒక రాష్ట్ర మంత్రి చనిపోవడం, ఒక కేంద్ర మంత్రి, ఒక గవర్నర్ ఆసుపత్రిలలో చేరడం దేశంలో ఇదే ప్రధమం కావడం గమనార్హం.

 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో  చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్లు అమిత్ షా స్వయంగా  ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్‌లో తెలిపారు. 

త‌న ఆరోగ్యం బాగానే ఉందని వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు అమిత్ షా తెలిపారు. ఇటీవ‌లి కాలంలో త‌న‌ను సంప్ర‌దించిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అమిత్ షా విజ్ఞ‌ప్తి చేశారు.

బాల గంగాధర తిలక్ 100వ వర్థంతి సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన వెబినార్ ప్రారంభ సమావేశంలో అమిత్ షా శనివారం పాల్గొన్నారు. దీంతో.. ఆ సమావేశంలో పాల్గొన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ లో కరోనా లక్షణాలు కనిపించడంతో చెన్నై లోని  కావేరీ ఆస్పత్రిలో చేరారు. గత నెల 29 నుంచి హోం క్వారంటైన్ లో ఉన్న భన్వరీలాల్ పురోహిత్ఇ వాళ ఆసుపత్రిలో చేరారు.
 
 కొద్ది రోజుల క్రితం తమిళనాడు రాజ్ భవన్ సిబ్బందిలో 84 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే గవర్నర్ గత నెల 29 నుంచి హోం క్వారంటైన్ అయ్యారు. అయితే ఇవాళ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ లో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే కావేరీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.