చైనాను సైనికంగా తట్టుకోగలమా? 

చైనాను సైనికంగా తట్టుకోగలమా? 
చలసాని నరేంద్ర 
భారత – చైనా సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, సైనిక ఘర్షణకు కూడా దారితీయడంతో రెండు దేశాలలో ఒక విధమైన ఆందోళన వ్యక్తం అవుతున్నది. రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యమా అనే ప్రశ్నలు సహితం తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న భౌగోలిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులలో యుద్ధంకు రెండు దేశాలలోని ప్రభుత్వాలు సిద్ధంగా లేవని చెప్పవచ్చు. 
 
ఆర్ధికంగా మనకన్నా నాలుగున్నర రేట్ల ఎక్కువ స్థాయిలో ఉండటమే కాకుండా, సైనికంగా సహితం ప్రపంచంలోనే రెండో పెద్ద సైన్యం, అత్యాధునిక ఆయుధాలు గల చైనాతో యుద్ధం వస్తే తట్టుకోవడం కష్టం కాగలదని మనదేశంలోని పలువురు వామపక్ష మేధావులు సూత్రీకరణ కూడా చేస్తున్నారు. 
 
భారత్ ఇప్పటి వరకు యుద్ధంలో ఓటమి చెందినది 1962లో చైనాతో మాత్రమే కావడం గమనార్హం. అయితే పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. 1962లో సహితం మన సేనలు చైనా నుండి ముప్పు ఉన్నదని, సంసిద్దులం కావాలని హెచ్చరిస్తున్నా `శాంతి దూత’గా పేరొందిన మన నాటి ప్రధాని పండిట్ నెహ్రు చైనాను ఎక్కువగా విశ్వసించి, మన సైనికాధికారులను విశ్వాసంలోకి తీసుకొనక పోవడంతో భారీ మూల్యం చెల్లింపవలసి వచ్చింది. తాను మోసపోయానని ఆ తరవాత నెహ్రు కూడా గ్రహించారు.
 
ఆనాడు చైనా సైన్యం కూడా అంత బలమైనది కాదు. మనం ముందు జాగ్రత్త చర్యలు తీసువుకంటే పరిస్థితులు అంత అధ్వాన్నంగా మారేవి కావు. అది వేరే విషయం. కేవలం సైనికుల సంఖ్య, అత్యాధునిక ఆయుధాలు ఆధునిక కాలంలో యుద్ధ భూమిలో విజయం తీసుకు రాలేవు. గాల్వన్ లోయలో మనకన్నా పలు రేట్లు ఎక్కువమంది చైనా సైనికులున్నా కొద్దిమంది భారత్ సైనికుల పరాక్రమం ముందు నిలబడలేక పోయారు. 
 
పాకిస్థాన్ తో జరిపిన యుద్ధాలలో ఆయుధాపరంగా మన వద్ద కన్నా ఆ దేశం వద్దనే అత్యాధునికమైనవి ఉన్నాయి. అయినా వారు విజయం సాధింపలేక పోయారు. 1962లో అసలు యుద్ధం జరిగిన్నట్లు చైనా తమ చరిత్రలో చెప్పుకోవడం లేదు. ఆ యుద్ధంలో తప్ప మరే యుద్ధంలో చైనా గెలుపొందలేదని ఇక్కడ గమనించాలి. 
 
రష్యాతో జరిగిన యుద్ధంలో ఘోరంగా ఓటమి చెందింది. చివరిసారిగా చిన్న దేశమైన వియత్నంతో 1979లో ఘోర పరాజయం పొందింది. అప్పటి నుండి నేరుగా యుద్ధాలను చైనా సాహసం చెయడం లేదు. అయితే భూభాగాలపై వివాదాలు రేపడం, పొరుగు దేశాలపై ఆర్ధికంగా ఆధిపత్యం వహించే ప్రయత్నాలు చేయడం చేస్తున్నది.
 
మనకన్నా ఎక్కువమంది సైనికులు ఉన్నా భారత్ దేశ సరిహద్దులలో చైనా సైన్యం చాల తక్కువగా ఉంది. ఈ విషయంలో మనదే పై చేయి. వారి సేనలు ఎక్కువగా జపాన్, వియత్నాం, తైవాన్ వంటి దేశాల సరిహద్దులపైననే దృష్టి సారిస్తున్నాయి. 
 
పైగా పర్వత ప్రాంతాలలో యుద్ధం చెయగల నేర్పు గల సేనలు భారత్ వద్దనే ఎక్కువగా ఉన్నాయని ఈ మధ్య చైనా సైనిక పత్రికలో ఆ దేశపు నిపుణుడు ఒక వ్యాసం వ్రాసారు. అమెరికా, చైనాలకు సహితం అటువంటి నైపుణ్యతగల సేనలు లేవని పేర్కొన్నాడు. చైనా సైనిక పత్రికలో మరో దేశం సైన్యం గురించి ఘనంగా వ్రాయడం బహుశా ఇదే ప్రధమం. 
 
అన్నింటికన్నా ముఖ్యమైన అంశం యుద్ధభూమిలో, దైనందిన శిక్షణాలలో భారత సైనికులకు ఉన్న నైపుణ్యం, అనుభవం చైనా సైనికులకు లేదు. మనం 1971 నుండి పలు యుద్దాలు చేసాము. పలు సరిహద్దు ఘర్షణలతో పాల్గొన్నాము. ఉగ్రవాద నిర్ములనలో సైనికులు సహితం క్రియాశీల పాత్ర వహిస్తున్నారు. 
 
అందుకనే చైనా వద్ద మనకన్నా మెరుగైన ఆయుధాలు ఉన్నప్పటికీ అవేవి ఇప్పటి వరకు యుద్ధభూమిలో ఉపయోగించినవి కావు. సరిహద్దు వెంబటి ఎప్పటి నుండి చైనా మౌలిక సదుపాయాలు ఏర్పర్చుకొంటున్నా మనం కూడా గత దశాబ్ద కాలంగా ఈ విషయంలో ఎక్కువగా దృష్టి సారిస్తున్నాము.
పైగా మన సేనలు వాస్తవాధీన రేఖకు దగ్గరలోనే బసవేసి ఉన్నాయి. చైనా స్థావరాలు కొంచెం దూరంలో ఉన్నాయి. పదాతి దళాలు, నావికా దళాలలో చైనా మనతో పోటీపడలేదు. చైనాకు మానవలె విశాలమైన సముద్ర ప్రాంతం లేదు. అందుకనే హిందూమహాసముద్రంలో మన నావికాదళం ఆధిపత్యం వహిస్తుంది. ఆ దేశంపై చేరే సరఫరాలను ఆపివేయగల శక్తీ మనకు ఉంది.
హార్వర్డ్‌లోని బెల్ఫెర్ సెంటర్,  సెంటర్ ఫర్ ఎ న్యూ అమెరికన్ సెక్యూరిటీ (సిఎన్‌ఎఎస్) ఇటీవల చేసిన అధ్యయనాలు పరిశీలిస్తే యుద్ధం అంటూ వస్తే చైనాకు ధీటుగా భారత్ నిలబడగలదని స్పష్టం అవుతుంది.

బెల్ఫెర్ నివేదిక ప్రకారం, భూమి, సముద్ర ఆధారిత బాలిస్టిక్ క్షిపణులు, విమానాలతో కూడిన చైనా అణ్వాయుధాలను అణు బాంబర్లుగా ఉపయోగించవచ్చు. ఒక అంచనా ప్రకారం, చైనాలో 104 క్షిపణులు ఉన్నాయి. ఇవి భారతదేశం అంతటా దాడి చేయగలవు.  భారత్  క్షిపణి దళాలలో ఎక్కువ భాగం చైనా కంటే పాకిస్తాన్ సమీపంలో ఉన్నాయి.

మరో నివేదిక ప్రకారం, భారత్ వద్ద గల పది అగ్ని -3 లాంచర్లు మొత్తం చైనా ప్రధాన భూభాగానికి చేరుకోగలవు. మరో ఎనిమిది అగ్ని- II లాంచర్లు మధ్య చైనా లక్ష్యాలను చేరుకోగలవు. జాగ్వార్ ఐఎస్  యొక్క రెండు స్క్వాడ్రన్లు,   మిరాజ్ 2000 హెచ్ ఫైటర్స్ కు చెందిన ఒక స్క్వాడ్రన్, మొత్తం 51 విమానాలను అణు మిషన్లతో పని చేయవచ్చు.

ఈ విమానాలు అణు గురుత్వాకర్షణ బాంబులతో కూడిన టిబెటన్ గగనతలానికి చేరుకోవచ్చు. వాస్తవానికి టిబెట్ లేనిదే చైనాకు భారత్ తో నేరుగా అసరిహద్దు ఉండదు. ప్రస్తుతం చైనాకు గల భూభాగాలలో 60 శాతంకు పైగా పలు పొరుగు దేశాల అనునది ఆక్రమించుకున్నవే.
 
వ్యూహాత్మకంగా టిబెట్ ప్రజల స్వతంత్ర కాంక్షకు భారత్ అండగా నిలబడితే చైనాను చాలావరకు కట్టడి చేసిన్నట్లు కాగలదు. భారత్ కు మొదటి నుండి రాజకీయ నాయకత్వంకన్నా బలమైన సైనిక నాయకత్వం ఉంటూ వస్తున్నది. నిర్ణయాత్మకంగా వ్యవహరింపగల సామర్ధ్యం ప్రతి సంక్షోభ సమయంలో ప్రదర్శిస్తున్నారు. 
 
కార్గిల్ వద్ద జరిగిన యుద్ధంలో భారత్ గెలుపొందుతుందని బహుశా ప్రపంచంలో ఎవ్వరు ఉహించి ఉండరు. అంతటి ప్రతికూల వాతావరణంలో సహితం మన సేనలు ఘన విజయం సాధించాయి. ఆధునిక కాలంలో దేశాల విస్తరణ వాదాన్ని కట్టడి చేయడంపై యుద్ధం తప్పనిసరి ఆయుధం మాత్రమే. తగిన దౌత్య, ఆర్ధిక, రాజకీయ నీతి ప్రదర్శిస్తే చైనాను కట్టడి చేయవచ్చు. 
 
(మన తెలంగాణ నుండి)