2022 నాటికి పేదరికం లేని, అవినీతి రహిత భారత్ 

2022 నాటికి పేదరికం లేని, అవినీతి రహిత భారత్ 

భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పేదరికం లేని, అవినీతి రహిత పరిస్థితుల్లో ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2022 ఆగస్టు 15న జరగబోయే 75వ స్వాతంత్ర్య దినోత్సవాలకు నవ భారతాన్ని ఆవిష్కరించడమే లక్ష్యమని ప్రకటించింది. దీనికి సంబంధించిన దార్శనిక పత్రాన్ని రూపొందించింది.  

ఈ దార్శనిక పత్రం (విజన్ డాక్యుమెంట్)ను నీతీ ఆయోగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించాయి. పేదరికం సమస్యకు పరిష్కారం కనుగొనడంలో భారత దేశం విజయం సాధించిందని ఈ పత్రం పేర్కొంది. విద్యుత్తు, తాగు నీరు, ఆరోగ్యం, విద్య సహా అన్ని రంగాల్లోనూ అభివృద్ధిపై దృష్టి సారించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. 

2022నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉంటుందని ఈ దార్శనిక పత్రం పేర్కొంది. నవ భారతం, 2022పై ని ప్రధాన మంత్రి నరేంద్ర  మోదీ నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంకితమైందని ఆ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ పత్రంలో తెలిపారు. 

వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంపు, గృహ వసతి కల్పన, విద్యుత్తు, విద్య సహా అన్ని రంగాల్లోనూ అభివృద్ధిపై దృష్టి పెడతామని వివరించారు. గ్రామాల్లో మౌలిక సమస్యలను గుర్తించి, ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా ఆ సమస్యలను  పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ దార్శనిక పత్రం పేర్కొంది.

ఈ ప్రణాళిక విజయవంతమయ్యేందుకు శిక్షణ, సామర్థ్య అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి, బ్యాంక్ క్రెడిట్, జల సంరక్షణ, ఆరోగ్యం, పోషకాహారం, విద్యుత్తు, గృహ నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ, ఎల్‌పీజీ గ్యాస్, ఇంటర్నెట్, వయోవృద్ధుల సంక్షేమం, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమం వంటి అనేక అంశాల్లో అభివృద్ధి గురించి ఈ దార్శనిక పత్రం వివరించింది.