వైద్య సిబ్బంది జీతాలు సరిగ్గా చెల్లించని 4 రాష్ట్రాలు 

క‌రోనా పోరులో ముందున్న వైద్య సిబ్బందికి నాలుగు రాష్ట్రాలు స‌రిగా జీతాలు చెల్లించ‌లేదు. మ‌హారాష్ట్ర‌, పంజాబ్‌, క‌ర్నాట‌క‌, త్రిపుర రాష్ట్రాలు వైద్యులు, న‌ర్సుల‌కు స‌మ‌యానుకూలంగా వేత‌నాలు చెల్లించ‌లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం సుప్రీంకోర్టుకు తెలిపింది. 
 
సుప్రీంకోర్టు జారీ చేసిన సూచ‌న‌ల‌ను ఈ రాష్ట్రాలు ప‌ట్టించుకోలేద‌ని చెప్పింది. అయితే కేంద్రమే  ఈ అంశంలో జోక్యం చేసుకోవాల‌ని సుప్రీంకోర్టు సూచించింది.
 
‘మీ సూచనలను రాష్ట్రాలు పట్టించుకోకపోతే నిస్సహాయులమని కేంద్ర ప్రభుత్వం భావించరాదు. మీ ఉత్తర్వులు అమలయ్యేలా చూడండి. విపత్తు నివారణ చట్టం‌ కింద అధికారాలను వాడే అవకాశం మీకు ఉంది. మీరు చర్యలు తీసుకోవచ్చు’ అని అశోక్ భూషణ్, ఆర్‌‌ సుభాష్​ రెడ్డి, ఎంఆర్ షాల త్రిసభ్య ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తాకు తెలిపింది.
 
ఈ మేర‌కు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. యుద్ధంలో సైనికులను బాధగా ఉంచలేరని అంటూ ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది
క‌రోనా పోరులో ముందున్న డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు జీతాలు చెల్లించ‌క‌పోవ‌డం నేరం కింద‌కు వ‌స్తుంద‌ని జూన్ నెల‌లో సుప్రీంకోర్టు తెలిపింది. కొంద‌రు డాక్ట‌ర్లు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా ఈ మేర‌కు స్ప‌ష్టం చేసింది.