జయలలిత ఆస్తుల స్వాధీనానికి ఆర్డినెన్స్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రకటించింది. జయలలితకు చెందిన 10,000 కు పైగా వస్త్రాలు, 8000 పుస్తకాలు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నారు. జయలలితకు చెందిన వాహనాలు, స్థిర ఆస్తులకు సంబంధించిన జాబితా కూడా సిద్ధం చేశారు. 

జయలలిత నివాసం అయిన వేద నిలయంకు రాష్ట్ర ప్రభుత్వం స్మారక చిహ్నం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కారణంగా జయలలిత దుస్తులు, పుస్తకాలు, వ్యక్తిగతంగా ఉపయోగించిన అనేక విలువైన వస్తువులు సహా అన్ని ఆస్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

విశేషమేమిటంటే, తమిళనాడు ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన వేద నిలయంను సొంతం చేసుకోవడానికి చెన్నైలోని సివిల్ కోర్టులో రూ.67 కోట్లు జమ చేసింది. 

జయలలిత ఆస్తులపై మద్రాస్ హైకోర్టు ద్వారా చట్టబద్దమైన వారసులుగా ప్రకటించి హక్కులు ఇచ్చినందున జయ స్మారక చిహ్నాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు జయలలిత మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్  సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఆదాయపు పన్ను, ఆస్తిపన్ను బకాయిలు చెల్లించడానికి రూ.36.9 కోట్లు చెల్లించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు జయలలిత రుణపడి ఉన్నారు. పన్ను చెల్లించిన తర్వాత, దాని మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగించబడతాయి. 0.55 ఎకరాల ఆస్తిని స్మారక చిహ్నంగా మార్చే బాధ్యత ఏఐఏడీఎంకే పార్టీకి ఉన్నదని, అధికార ఏఐఏడీఎంకే పేర్కొన్నది. 

2017 లో ముఖ్యమంత్రిగా పళనిస్వామి అధికారం చేపట్టిన తరువాత కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘ అనారోగ్యంతో 2016 డిసెంబర్‌లో మరణించారు.