దేశంలో విద్యావిధానంలో సమూల మార్పులు 

కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్‌డీ) పేరును  విద్యాశాఖ‌గా మారుస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు ప్ర‌ధాని నరేంద్ర  మోదీ నేతృత్వంలో  కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. అదేవిధంగా నూత‌న జాతీయ విద్యా విధానానికి కూడా మంత్రివర్గం  ఆమోద ముద్ర‌వేసింది.
 దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. 34 సంవత్సరాల తరువాత భారతదేశంలో ప్రభుత్వం కొత్త విద్యా విధానం తెచ్చింది. పాఠశాల-కళాశాల వ్యవస్థలో పెద్ద మార్పులు చేసింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఇస్రో మాజీ చీఫ్‌ కే కస్తూరి రంగన్‌ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ మొదట మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసింది. నూతన విద్యావిధానం ముసాయిదాలో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు  కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
కొత్త విద్యా విధానం ప్రకారం ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరొక కోర్సు తీసుకోవాలనుకుంటే, అతను మొదటి కోర్సు నుంచి పరిమిత సమయం వరకు విరామం తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.  నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్యను కేంద్రం తప్పనిసరి చేసింది.
విద్యార్థులపై కరికులమ్‌ భారం తగ్గించాలనేది నూతన విధానం ఉద్దేశమని స్పష్టం చేసింది. 2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండనున్నట్టు తెలిపింది. ఇకపై ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవని వెల్లడించింది.
 
అలాగే ప్రస్తుతం ఉన్న విధానంలో కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 10+2+3(పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ) విధానాన్ని 5+3+3+4 మర్చారు. ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్‌ అమలు చేయనున్నారు. 
 
కొత్త విధానంలో ఇంటర్‌ విద్యను రద్దు చేసి.. డిగ్రీ విద్యను నాలుగేళ్లుగా మార్పు చేశారు. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్‌, ప్రోగామింగ్‌ కరికులమ్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆరో తరగతి నుంచే వొకేషన్‌ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్‌ నేర్పే ప్రయత్నం చేయనున్నారు. ఎమ్‌.ఫిల్‌ కోర్సును పూర్తిగా రద్దు చేశారు.
 
దేశీయ విద్యా విధానంలో భారీగా మార్పులు తీసుకురావాల్సి ఉన్న‌ద‌ని ప్ర‌ధాని మోదీ గ‌త మే నెల‌లో ప్ర‌క‌టించారు. విద్యారంగంలో సాంకేతిక‌త ప‌రిజ్ఞానం వినియోగంపై ప్ర‌త్యేక దృష్టిసారించాల‌ని చెప్పారు. జాతీయ విద్యావిధానానికి (ఎన్ఈపీ) చివ‌రిసారిగా 1992లో స‌వ‌ర‌ణ‌లు చేశారు. 1986లో మొద‌టిసారిగా ఎన్ఈపీని రూపొందించారు. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే.