మహారాజకీయాల్లో ఫొటో కలకలం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాకరే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ  ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌ పోస్ట్‌ చేసిన ఫొటో ‘మహా’ రాజకీయాల్లో కలకలంగా మారింది. 
 
రాష్ట్రంలోని మహావికాశ్‌ అగాఢ ప్రభుత్వ భవిష్యత్తు ప్రతిపక్షాల చేతిలో లేదని, స్టీరింగ్‌ తన చేతిలోనే ఉందన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే వ్యాఖ్యానించిన కొద్దిగంటల్లోనే ఈ ఫొటో వెలువడడం గమనార్హం. 
 
‘‘ఆటోరిక్షా ఎటు వైపు వెళ్లాలన్నది డ్రైవర్ నిర్ణయించడు. వెనుక కూర్చున్న ప్రయాణికులే గమ్యాన్ని నిర్దేశిస్తారు’’  బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. 
 
ఈ ఫొటోలో ఒక వాహనంలో అజిత్‌ పక్కన ఉద్ధవ్‌ కూర్చోగా, స్టీరింగ్‌ మాత్రం అజిత్‌ పవార్‌ చేతిలో ఉంది. అంటే ప్రభుత్వ  స్టీరింగ్‌ తన చేతిలోనే ఉందంటూ తెలిపేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ ఫొటోను పోస్ట్‌ చేశారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 
 
అంతకు ముందు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సామ్నా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మహావికాస్ అగాఢీ ప్రభుత్వ భవిష్యత్తు ప్రతిపక్షాల చేతిలో లేదని, ఎందుకంటే స్టీరింగ్ తన చేతిలో ఉందని ప్రకటించారు. ప్రభుత్వానికి తానే డ్రైవర్‌నని తెలిపారు. ఆటోరిక్షా వంటిది తమ ప్రభుత్వమని, కాంగ్రెస్, ఎన్సీపీ రెండు చక్రాల్లాంటివని… అవి మా వెనక ఉన్నాయని ప్రకటించారు.
 
కాగా, ఈ ఫొటోపై అజిత్‌పవార్‌ మాట్లాడుతూ ఈ ఫొటోను శుభాకాంక్షలు తెలిపుతూ పోస్ట్‌ చేశానని, దీనిపై రాద్ధాంతం అనవసరమని పేర్కొన్నారు.