నా బ‌ట్ట‌లు నేనే ఉతుక్కుంటున్నా  

కరోనా ఆవహించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్   భోపాల్‌లోని చిరాయు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.  ఆయ‌న భార్య‌కు మాత్రం వైర‌స్ ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వ‌చ్చింది. హాస్పిట‌ల్ నుంచి సీఎం శివ‌రాజ్ వ‌ర్చువ‌ల్ వీడియోలో మాట్లాడారు.

‘‘ఆస్పత్రిలో నా చాయ్ నేనే తయారుచేసుకుంటున్నా. కొవిడ్ రోగులు తమ దుస్తులు వేరే వాళ్లతో ఉతికించకూడదు కాబట్టి, నా బట్టలు కూడా నేనే ఉతుక్కుంటున్నా” అంటూ తెలిపారు. బట్టలు ఉతుక్కోవడం వల్ల నాకు ఓ ప్రయోజనం జరిగిన్నట్లు చెప్పారు.

“గతంలో నా చేతికి సర్జరీ జరిగింది. అనేకమార్లు ఫిజియోథెరపీ చేసినా నా చేత్తో దేన్నీ గట్టిగా పట్టుకోలేకపోయాను. పిడికిలి వచ్చెడిది కాదు. కానీ ఇప్పుడు బట్టలు ఉతకడం వల్ల నా చెయ్యి బాగుపడింది. కాబట్టి కొన్ని పనులు స్వయంగా మన చేతులతోనే చేసుకోవడం మంచిదనిపించింది…’’ అని సీఎం చౌహాన్ పేర్కొన్నారు.

సీఎం శివ‌రాజ్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే త‌న విధుల‌ను నిర్వ‌ర్తించారు. రెండ‌వ సారి కూడా ఆయ‌న శ్యాంపిల్‌లో క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది. మంత్రివర్గంలోని న‌రోత్త‌మ్ మిశ్రా, విశ్వాస్ సారంగ్‌, ప్ర‌భురామ్ చౌద‌రీల‌కు కొన్ని బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. హాస్పిట‌ల్‌లో చికిత్స పొందిన‌న్ని రోజులు సీఎం ఎటువంటి ఫైళ్ల‌పై సంత‌కం చేయ‌ర‌ని ప్రకటించారు.

ఇవాళ తన ఆస్పత్రి బెడ్ మీద నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చౌహాన్ పలువురు మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడారు. బ్లూ హాస్పిటల్ గౌన్‌లో, మాస్క్ ధరించి కనిపించారు. రాష్ట్రంలో కొవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన ఈ సమావేశం నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

61 ఏళ్ల చౌహాన్. తనకు కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని శనివారం ప్రకటించారు. అదేరోజు భోపాల్‌లోని చిరాయు ఆస్పత్రిలో చేరారు. కాగా నిన్న విడుదల చేసిన మరో వీడియోలో తాను బాగానే ఉన్నాననీ, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లెవరూ ‘‘భయపడాల్సిన అవసరం లేదని’’  ఆయన పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.