భారత్ కు దూరంగా చైనా, పాక్ చెంతకు బాంగ్లాదేశ్ 

భారత్ కు దూరంగా చైనా, పాక్ చెంతకు బాంగ్లాదేశ్ 

దక్షిణాసియాలో భారత్ కు నమ్మకమైన మిత్రదేశంగా ఉంటూ వస్తున్న బాంగ్లాదేశ్ కొంత కాలంగా మనకు దూరంగా, చైనా, పాకిస్థాన్ లకు దగ్గరగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా గత ఏడాది ప్రధాన మంత్రిగా తిరిగి ఎన్నికైనప్పటి నుండి షేక్ హసీనా ధోరణిలో మార్పు వచ్చిన్నట్లు భావిస్తున్నారు. 

ప్రముఖ బంగ్లా పత్రిక బోరెర్ కాగోజ్ కధనం ప్రకారం అప్పటి నుండి ఆ దేశంలోని భారత దేశపు మౌలిక సదుపాయాలు నత్తనడక ప్రారంభం అవుతూ ఉండగా, చైనా ప్రాజెక్టులు వేగం పుంజుకొంటున్నాయి. భారత్ సరిహద్దుకు సమీపంలోని సైల్హేట్ విమానాశ్రయం నిర్మాణం కాంట్రాక్టు ను భారత్ అభ్యంతరాలను లెక్కచేయకుండా ఒక చైనా కంపెనీకు అప్పగించారు. 

గత నాలుగు నెలలుగా ప్రధాన మంత్రిని కలవాలని ప్రయత్నం చేస్తున్నా బాంగ్లాదేశ్ లోని భారత రాయబారి రివ గంగూలీ దాస్ కు ఆమె సమయం కేటాయించడం లేదు. పైగా, కరోనా కట్టడికి భారత్ అందించిన సహాయం పట్ల ఆ దేశం ప్రశంసాపూర్వకంగా కూడా ఇప్పటి వరకు మాట్లాడక పోవడాన్ని ఈ పత్రిక కధనం ప్రస్తావించింది. 

ఇదివరలో భారత్ – ఇరాన్ సంయుక్తంగా నిర్మించ దలచిన చబహార్ పోర్ట్ రైల్వే ప్రాజెక్ట్ నుండి భారత్ ను ఈ మధ్య తప్పించి ఇరాన్ చైనాతో చేతులు కలపిన రీతీలో బాంగ్లాదేశ్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. 

గత వారం బుధవారం ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొదటిసారిగా ఫోన్ చేసి హసీనాతో ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకున్నది. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక, సంబంధాలు కోరుకొంటున్నట్లు తెలిపారు.

హసీనా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1971 యుద్ధ నేరస్థులపై విచారణలు పూర్తి చేసి, వారికి శిక్షలు విధిస్తూ అనడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి.  పైగా 1971లో జరిగిన అవమానాన్ని పాకిస్థాన్ ఎప్పటికి మరచిపోలేదు. అయితే బాంగ్లాదేశ్ లో పెరుగుతున్న చైనా ప్రభావంతో పాకిస్తాన్ సహితం ఆ దేశంపై దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.

అయితే ఈ సంభాషణల గురించి బాంగ్లాదేశ్ పెదవి విప్పక పోయినప్పటికీ పాకిస్థాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ప్రకారం ఆక్రమిత కాశ్మీర్ లో నెలకొన్న సున్నిత పరిస్థితులను ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. కాగా,  పరిస్థితుల కాశ్మీర్ పరిష్కారం కోసం బాంగ్లాదేశ్ సహాయం ఇమ్రాన్ ఖాన్  కోరగా కాశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారంగా భావిస్తున్నట్లు హసీనా స్పష్టం చేయడం పట్ల భారత్ సంతోషం వ్యక్తం చేసింది.